ఓస్ల్లో, జనవరి 11: తాను అందుకున్న నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అంకితం చేస్తానని అన్న.. మారియా కొరినా మచాడో మాటల్ని నోబెల్ శాంతి కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డును మరొక వ్యక్తితో పంచుకోలేం, రద్దు చేయలేం, బదిలీ చేయలేం.. అని నార్వేనియన్ నోబెల్ కమిటీ తాజాగా స్పష్టం చేసింది.
శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పురస్కార గ్రహీత పేరు ఒకసారి ప్రకటించాక.. ఇక అదెప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నది. తనకు అందిన ప్రైజ్ మనీ మొత్తాన్ని అవార్డు గ్రహీత ఎవరితోనైనా పంచుకోవచ్చునని తెలిపింది. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అవార్డు అందుకున్న తర్వాత వారు చెప్పే లేదా చేసే విషయాలపై సాధారణంగా స్పందించమని కమిటీ పేర్కొన్నది.