సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ విభజనను, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నగరం అట్టుడికిపోయింది.. గులాబీ శ్రేణుల ఆందోళన హోరెత్తింది.. దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు, మోదీ వ్యతిరేక నినాదాలతో భగ్గుమంది.. బడాయి మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని భాగ్యనగరం డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనపై ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తెలంగాణ ఉద్యమకారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు భారీఎత్తున ఆందోళన చేపట్టారు. నల్లటి అంగీలు, రిబ్బన్ల్లు ధరించి ర్యాలీలు చేపట్టారు. ‘మోదీ హఠావో.. తెలంగాణ బచావో’ ప్లకార్డులతో బైఠాయించారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటే శ్, ముఠా గోపాల్‌తో కలిసి మంత్రులు తలసాని, మహమూద్‌అలీ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని పాలతో శుద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష, పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని.. ఆదుకోకపోగా, కొత్త రాష్ట్రంపై ప్రధాని విషం చిమ్ముతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొనారు.
గ్రేటర్ అట్టుడికింది. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలంతా ఒక్కటై కదం తొక్కారు. కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులపై నిరసనలు వ్యక్తం చేశారు. బైక్ ర్యాలీలతో పాటు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి మోడీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
బీజేపీని నిలదీయాలి..
– మంత్రి మల్లారెడ్డి
బీజేపీ కుట్రలు పార్లమెంట్ సాక్షిగా బట్టబయలయ్యాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. ఇందులో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై ప్రధాని మోదీకి ఎందుకంత కసి అని ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహంగా ఉందని.. బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లో బీజేపీ నేతలను నిలదీయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
మోదీ కో హఠావో.. దేశ్‌కో బచావో..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిరసన కార్యక్రమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మోదీ కో హఠావో.. దేశ్ కో బచావో అంటూ నినాదాలు మార్మోగాయి. తెలంగాణ ద్రోహి మోదీ అంటూ ప్రతిఒక్కరూ నినదించారు. తూంకుంట, కండ్లకోయ, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, గండిమైసమ్మలో నిర్వహించిన నిరసన కార్యకమాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణపై ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారన్నారు.
ఓర్వలేకే ఆరోపణలు..
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ వైపే తెలంగాణ సమాజం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. అధికార దాహంతో ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు అవాకులు, చెవాకులు పేలడం ఆపకపోతే తగిన శాస్తి చేస్తాం. కమలం నేతల డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. పార్లమెంట్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలతో తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ తేటతెల్లం అయ్యింది. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తెలంగాణ వ్యతిరేకులకు రాష్ట్ర ప్రజలు సమాధి కట్టడం ఖాయం. తెలంగాణ అభివృద్ధి అడ్డుకుంటున్న బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
– కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
బీజేపీ పతనం ఖాయం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాజకీయాలు చేయాలనుకున్నప్పుడే బీజేపీ నేతలు తెరపైకి విభజన అంశాన్ని తెస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విభజన అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్‌నగర్ నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నల్ల కండువాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. సింగరేణిని అమ్మితే బీజేపీ పతనం ఖాయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిరసన ప్రదర్శనల్లో భాగంగా టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మిరెడ్డి, మహేశ్వరి శ్రీహరి, కుర్మ హేమలత తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణలు చెప్పాలి..
నాలుగు రోజుల క్రితం సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ ఢిల్లీకి వెళ్లగానే తెలంగాణపై విషం కక్కడం ప్రారంభించారు. దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని అవమానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టాన్ని మోదీ అపహాస్యం చేయడం సిగ్గుచేటు. రాష్ట్రం ఏర్పాటైన 8 ఏండ్ల తర్వాత విషపూరితమైన మాటలు మాట్లాడం ఆక్షేపనీయం. మోదీ వ్యాఖ్యలతో తెలంగాణపై బీజేపీకి ఉన్న వ్యతిరేకత తేటతెల్లం అయ్యింది. మనసులో కోపం పెట్టుకొని విభజన హామీలు నెరవేర్చడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న తెలంగాణను చూసి ఓర్వలేని తనంతోనే మోదీ అక్కసును వెళ్లబోసుకుంటున్నారు. ప్రధాని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి.
పిచ్చి ప్రేలాపనలు మానాలి..
ఎందరో అమరుల త్యాగాలను కించపర్చేలా ప్రధాని మోదీ మాట్లాడం సిగ్గుచేటు. ప్రజల ఆకాంక్ష.. ఉద్యమ నేత కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. స్వరాష్ట్ర సాధనలో జేజీపీ నేతల పాత్ర శూన్యం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే బీజేపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు సమర్థిస్తారా లేదా అన్నది తేలాలి? ప్రధాని మోదీ తెలంగాణపై విషం కక్కడం మాని బహిరంగ క్షమాపణలు చెప్పాలి.
– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సాయం మరిచి విమర్శలా..
అన్ని రాష్ర్టాల కంటే అభివృద్ధిలో ముందున్న తెలంగాణపై అక్కసుతోనే ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారు. సుమారు ఐదు దశాబ్దాల పోరాటాల ఫలితంగానే స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందంటూ మోదీ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు గడుస్తున్నా తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చింది శూన్యం.
– మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం..
సుదీర్ఘ పోరాటాల తర్వాతే కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణను ప్రకటించింది. సాధించుకున్న తెలంగాణ బంగారు మయం అవుతుండటంతో ఓర్వలేని బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికి విభజన హామీలు అమలుపరచడం లేదు. రాష్ట్ర మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా ఊరుకోం.
– దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
కించపరిస్తే ఊరుకోం..
ప్రధాని మోదీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం వీరికి బుద్ధి చెప్పడం ఖాయం. అన్ని పార్టీల మద్దతుతో ఏర్పాటైన రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారు. ప్రధాని తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని.. పార్లమెంట్లో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే