హుజూరాబాద్, అక్టోబర్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హుజూరాబాద్‌లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలవారు సంతోషంగా ఉన్నారని స్పష్టంచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. సత్య హరిచంద్రునిలా మాట్లాడుతున్న బండి సంజయ్.. కరీంనగర్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు. చట్టాలను తుంగలో తొకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీటింగ్ పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్నే ఆదరిస్తున్నారని పునరుద్ఘాటించారు. బీజేపీ సానుభూతి డ్రామాలు హుజూరాబాద్‌లో సాగవని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ రూ.20 వేలు ఇస్తున్నదని బండి సంజయ్ ఝూటా మాటలు చెప్తుండని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. నేను హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వస్తాను.. నువ్వు వస్తావా బండి సంజయ్? ఇద్దరం ప్రమాణం చేద్దామా? అని సవాల్ విసిరారు. అబద్ధపు మాటల్లో బండి ఆరితేరారని విమర్శించారు. ఇటీవల గ్యాస్‌పై ఈటలకు మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరితే తోక ముడిచిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అసత్యపు ప్రచారాలతో బీజేపీ గోబెల్స్‌ను మించిపోయిందని ఎద్దేవాచేశారు.
ఎన్నికల కమిషన్‌కు బీజేపీ రాసిన లేఖతోనే దళితబంధు ఆగిపోయిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. దళితులు బాగుపడితే చూడలేక ఆ పథకాన్ని ఆపివేయించి పైశాచిక ఆనందం పొందారని దుయ్యబట్టారు. బండి సంజయ్ పచ్చి అబద్ధాలను దళితులెవ్వరూ నమ్మరని, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ సర్కారు చేయూతనిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు. కనీసం బీసీ గణన చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈటల తన ప్రచారంలో ఒకసారి కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పలేదు. ఎంతసేపూ వాళ్ల వీళ్ల మీద పడి ఏడుస్తున్నడు. రేపు ఏం చేస్తడో కూడా చెప్పడం లేదు. అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలె. కారు గుర్తుకు ఓటేయాలె.
-బండ ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు
బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఓటేస్తే అవినీతికి వేసినట్టే. హాస్టల్లో ఉండి దొడ్డు బియ్యం తిన్న అన్న ఈటల, అనతికాలంలోనే వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు. ఓటుకు రూ.5 వేలతోపాటు మద్యం బాటిళ్లు పంచుతున్న బీజేపోళ్లు.. దొంగే దొంగ అన్నట్టు టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్కు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తాయి. దళితుల అభ్యున్నతి కోసం సీఎం ప్రారంభించిన దళితబంధు ప్రపంచంలోనే గొప్ప
పథకం. ఈ పథకాన్ని చూసి నేను టీఆర్ఎస్లో చేరాను.
–మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతున్నది. పేద ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నది. హుజూరాబాద్‌లో ఆ పార్టీ నాయకులకు ఓటు అడిగే అర్హతనే లేదు. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా?. ప్రచారంలో ధరల గురించి ఈటల రాజేందర్ ఒక్క మాటైనా మాట్లాడారా?. ప్రజలు బీజేపీ మోసపూరిత మాటలు నమ్మరు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనును గెలిపిస్తరు.
-ఎల్ రమణ, మాజీ మంత్రి
గత ప్రభుత్వాలు ఎస్సీలను పట్టించుకోలేదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళితబంధు పథకం అమలుచేస్తున్నారు. దళితబంధుపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దు. నియోజకవర్గంలోని దళితులందరూ కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
-పిడమర్తి రవి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకం. అణగారిన వర్గాలను అణిచివేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ సబ్బండ వర్ణాలకు సమన్యాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దళితుల బాగు కోసం సీఎం కేసీఆర్ దళితబంధు తెస్తే ఓర్వలేని బీజేపీ ఈసీకి లేఖ రాసి ఆపేయించింది. బీజేపీకి చేతనైతే అందరికీ సమానంగా భూ పంపిణీకి సంబంధించిన చట్టం తేవాలి. పనిచేసే ప్రభుత్వానికి దళిత సమాజం అండగా నిలువాలి. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనును గెలిపించాలి.
-వంగపల్లి శ్రీనివాస్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు