కమలాపూర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రచారం జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరూరా తిరుగుతూ బీజేపీ వల్ల దేశానికి, రాష్ట్రానికి నష్టం కలుగుతోందని, ఆ పార్టీకి ఓటేయ్యద్దంటూ ప్రజలను కోరుతున్నారు. కేంద్రం సర్కారు అసమర్థ పాలన వల్లే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయంటూ మంత్రి హరీశ్‌రావు ప్రతి సభలోనూ చెబుతున్నారు. కాగా, కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం వినూత్న ప్రచారం చేపట్టారు. గ్యాస్‌బండకు దండంపెట్టు..బీజేపీని బొంద పెట్టు.. అని రాసిన సిలిండర్లను సైకిల్‌కు కట్టుకొని వీధివీధినా తిరిగారు. ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీకి ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు.