హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరుగనున్నది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నది. యాసంగి ధాన్యం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావాన్ని బట్టి యాసంగిలో వరియేతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం 4,200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వానకాలం వడ్లను ఇప్పటికే సేకరించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎలాంటి ఆలస్యం లేకుండా రెండుమూడు రోజుల్లోనే రైతులకు డబ్బు లు చెల్లిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పడం, మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు యాసంగిలో వరిపంటే వేయాలని రైతులను రెచ్చగొడుతుండటంపై ఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. యాసంగి వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల కుట్రలను ఎండగట్టేందుకు ఎలాంటి రాజకీయ కార్యాచరణ రూపొందించాలన్నదానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.