న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివిధ పార్టీ నేతలతో కలిసి ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనున్నారు. 19 పార్టీలకు ఆమె ఆహ్వానం పంపారు. కానీ కొన్ని పార్టీలు ఆ మీటింగ్కు హాజరుకావడం లేదు. ఆ జాబితాలో టీఆర్ఎస్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపడం వల్లే.. ఆ భేటీకి దూరంగా ఉంటున్నట్లు కొన్ని పార్టీలు స్పష్టం చేశాయి. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ వచ్చినా వెళ్లేవాడిని కాదని, ఎందుకంటే వాళ్లు కాంగ్రెస్ను ఆహ్వానించారని అన్నారు.
కొత్త రాష్ట్రపతి ఎన్నికను జూలై 18వ తేదీన నిర్వహించనున్నారు. ఆ ఎన్నిక ఫలితాలను జూలై 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు తమ అభ్యర్థి విషయంలో భేటీ నిర్వహిస్తున్నాయి. బీజూ జనతాదళ్ కూడా ఈ మీటింగ్కు రావడం లేదని తెలిసింది. శిరోమని అకాళీదళ్కు కూడా దీదీ ఆహ్వానం పంపారు. కానీ ఆ పార్టీ కూడా డుమ్మా కొట్టే ఛాన్సు ఉంది. మమత మీటింగ్కు లెఫ్ట్ పార్టీలు హాజరుకానున్నాయి.