e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News త్వరలో పోడు సమస్యకు పరిష్కారం.. ఆర్వోఎఫ్‌ఆర్‌ పథకం అంటే..

త్వరలో పోడు సమస్యకు పరిష్కారం.. ఆర్వోఎఫ్‌ఆర్‌ పథకం అంటే..

 • పట్టాల కేటాయింపు కంటే అధికంగా ఆక్రమణలు
 • అటవీభూములను గద్దల్లా తన్నుకుపోతున్న పెద్దలు
 • బినామీ పేర్లతో పాగా వేస్తున్న రాజకీయ నేతలు
 • అన్యాక్రాంత అటవీభూముల రక్షణే ప్రభుత్వ లక్ష్యం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య త్వరలో పరిష్కారం కానున్నది. అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనుల జీవనాధారం దెబ్బతినకుండా, న్యాయబద్ధంగా జీవనభృతి కోసం సాగుచేసుకొంటున్న రైతులను గుర్తించేందుకు కచ్చితత్వాన్ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన సాగుదారులకు హక్కులు కల్పించడంతోపాటు బినామీ పోడు సాగుదారులను తప్పించడం ద్వారా అన్యాక్రాంతమైన అడవులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. పోడు భూముల పేరుతో రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల శాసనసభలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖ మంతి సత్యవతిరాథోడ్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. పలుమార్లు సమావేశమైన ఉపసంఘం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక రూపొందిస్తున్నది. అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం కూడా బుధవారం నుంచి మూడ్రోజులపాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నది. అనంతరం ఈ నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన పోడుభూముల సమస్య ఉన్న జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో దాదాపు పోడుభూముల సమస్యకు తుది పరిష్కారం లభించే అవకాశమున్నది. పోడు ఆక్రమణలో ఉన్న గిరిజనేతరులను గుర్తించేందుకు అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖలతో సంయుక్తంగా ప్రభుత్వం సర్వే చేపడుతున్నది. సంయుక్త విచారణ అనంతరం జిల్లాస్థాయి కమిటీల ద్వారా అనర్హులను తొలగించి, అర్హులైన గిరిజనులకు పోడు హక్కులను కల్పించనున్నది. దీంతో వారికి కూడా ప్రభుత్వం తరుపున అందించే వ్యవసాయ పథకాలన్నీ వర్తించనున్నాయి. అంతేకాకుండా భూమిని ఆక్రమించుకోబోమని రైతుల ద్వారా హామీ పత్రాలను కూడా తీసుకోనున్నారు.

రాజకీయ అండతో అధికారులపై దాడులు

రాజకీయ నాయకుల అండతో కబ్జాలకు పాల్పడినవారు అటవీశాఖ అధికారులపై దాడులకు సైతం తెగబడుతున్నారు. కాగజ్‌నగర్‌ అడవుల్లో కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా నరసాల గ్రామంలో 2019 జూన్‌ 30న మహిళా రేంజ్‌ అధికారితోపాటు పలువురు సిబ్బందిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎమ్మెల్యే అండతో ఏకంగా పెద్దపులి సంచరించే కోర్‌ ఏరియాలోనే కబ్జాలకు పాల్పడ్డారు.
94,273 మందికి అటవీ హక్కుపత్రాలు
సమైక్య రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హ యాంలో ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద దేశంలోనే అత్యధికంగా పట్టాలిచ్చారు. విచ్చలవిడిగా ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద హక్కుపత్రాలు ఇచ్చిన రాష్ర్టాల జాబితాలో ఉమ్మడి ఏపీ టాప్‌లో ఉన్నది. తెలంగాణలో 94,273 మందికి అటవీభూమి హక్కుపత్రాలిచ్చారు. సామాజిక అవసరాల కింద మరో 5 లక్షల ఎకరాలను కేటాయించారు. అయినా తెలంగాణలో మరో ఐదు లక్షల నుంచి పది లక్షల ఎకరాలకు అటవీభూమిలో హక్కుపత్రాలు కావాలనే డిమాండ్‌ ఉన్నది. అటవీభూముల్లో సాగు చేసుకొంటున్న గిరిజనులు, ఆదివాసీలతో సమస్య లేదు. కానీ రాజకీయ పెద్దల బినామీ కబ్జాల కారణంగానే అడవులు విధ్వంసమవుతున్నాయి.

పోడుభూములు విస్తరించి ఉన్న జిల్లాలు

- Advertisement -

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,36,117 ఎకరాల్లో సాగుచేస్తున్న 37,324 మంది రైతులకు 2006లో అటవీ హక్కుపత్రాలిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 17,657 మంది రైతులకు 69,654 ఎకరాలు, అసిఫాబాద్‌ జిల్లాలో 12,635 మందికి 46,329 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1,532 మంది రైతులకు 354 ఎకరాలకు, నిర్మల్‌ జిల్లాలో 5,500 మంది రైతులకు 16,589 ఎకరాలు హక్కుపత్రాలను అందజేశారు.

 • ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ, చందంపేట, దామరచర్ల, అడవిదేవులపల్లి, మఠంపల్లి, మేళ్లచేర్వు, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో 4వేల ఎకరాలకు 2006లో పట్టాలిచ్చారు.
 • ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 400కు పైగా ఎకరాల్లో పోడు వ్యవసాయం సాగవుతున్నది. 40 మంది గిరిజనులు 150 ఎకరాల్లో, 90 మంది గిరిజనేతరులు 280 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం, పినపాక, కరకగూడెం మండలాల్లో 2వేల ఎకరాలు, ఆళ్లపల్లి మండలంలో 7వేల ఎకరాలు, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ఆశ్వారావుపేట మండలాల్లో 17వేల ఎకరాల్లో పోడు సమస్య అధికంగా ఉన్నది. ఇల్లెం దు మండలంలో 29 వేల ఎకరాలు, కొత్తగూ డెం, వైరా, భద్రాచలం, మణుగూరు, అశ్వరావుపేట మండలాల్లోనూ పోడు సమస్య ఉన్నది.
 • కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, పెద్దపల్లి, మంథని, పాలకుర్తి, అంతర్‌గాం, రామగిరి మండలాల్లో 50 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు.
 • వరంగల్‌ జిల్లా ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో దాదాపు 13వేల ఎకరాల్లో రైతులు పోడుభూములను సాగుచేస్తున్నారు.
 • మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 93 వేల ఎకరాల్లో రైతులు అటవీభూముల్లో సాగుచేసుకొంటున్నారు. గంగారం, కొత్తగూడ, గూడురు, కేసముద్రం, మహబూబాబాద్‌, బయ్యారం, గార్ల, డోర్నకల్‌ మండలాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నాయి. 2006లో అప్పటివరకు సాగులో ఉన్న 15 వేల ఎకరాలకు హక్కుపత్రా లు ఇచ్చారు. ప్రస్తుతం 93 వేల ఎకరాల్లో సాగుచేసుకొంటున్నారు. ఇలాంటి చోట్ల నిత్యం అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, కాటారం, మహాముత్తారం, మహదేవ్‌పూర్‌, పు లిమెల, మల్హర్‌రావు మండలాల్లోని గిరిజనులు పోడు సాగుచేస్తున్నారు. గతంలో ఈ ఆరు మం డలాల పరిధిలోని 48 గ్రామాలకు చెందిన 4,408 మంది రైతులు పట్టాల కోసం దరఖా స్తు చేసుకొన్నారు. అటవీశాఖ చట్టాల కు లోబడి అటవీ, రెవెన్యూశాఖల అ ధికారులు ఉమ్మడిగా సర్వే చేసి ఇం దులో 3,204 దరఖాస్తులను తిరస్కరించారు. 1,384 మంది రైతులకు 2,582 ఎకరాల 14 గుంటల భూ మికి పాస్‌ పుస్తకాలు జారీచేశారు.
 • నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల, అమ్రాబాద్‌, కొల్లాపూర్‌, చారకొండ, బిజినేపల్లి మండలాల్లోని 53 గ్రామా లు, తండాల్లో 1,452 కుటుంబాలు 4,353 హెక్టార్లలో అటవీభూముల ను సాగుచేస్తున్నాయి. 2008-09 లో 714 చెంచు, 577లంబాడీకు టుంబాలకు పట్టాలిచ్చారు.

ఆర్వోఎఫ్‌ఆర్‌ పథకం అంటే..

చాలా ఏండ్లుగా అడవుల్లోనే నివాసముంటూ, పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, ఇతర సంప్రదాయ తెగలకు చెందినవారికి సదరు భూమిపై యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన (రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టాన్ని 2006 డిసెంబర్‌ 29న రాష్ట్రపతి ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం 13 డిసెంబర్‌ 2005 కంటే ముందు అటవీభూములపై కబ్జాలో ఉండి, వ్యవసాయం చేసుకొంటున్న గిరిజనులకు, పేదలకు హక్కుపత్రాలు ఇవ్వాలనే నిబంధన ఉన్నది. ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్లు లేదా పది ఎకరాలకు మించకుండా హక్కుపత్రాలు ఇస్తారు. చట్టం అమల్లోకి వచ్చిన మూడు నుంచి ఆరు నెలల్లోపు ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అటవీశాఖ భూముల్లో కబ్జాదారుల పాగా

ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద ఒక కుటుంబం గరిష్ఠంగా 4 హెక్టార్లు లేదా పది ఎకరాల వరకు మాత్రమే హక్కుపత్రాలు పొందడానికి అర్హత ఉంటుంది. కానీ రాష్ట్రంలో కొంతమంది నాయకులు బినామీ పేర్లతో 10 నుంచి 30 ఎకరాల వరకు కబ్జాచేసినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గిరిజనేతరులైన వెయ్యి మంది చేతిలోనే సుమారు 25 వేల నుంచి 30 వేల ఎకరాలు అటవీభూమి బందీగా ఉన్నట్టు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. పోడు భూములకు పట్టాలిస్తారనే ప్రచారం జరుగుతున్న నాటినుంచి కబ్జాదారుల ఆగడాలు మరింత పెరిగిపోయాయి. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల వరకు అడవులు విస్తరించి ఉండగా అందులో సుమారు 8 లక్షల ఎకరాలు కబ్జాలతో కనుమరుగైంది. మరో 10 లక్షల ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొన్నది. ఇందులో సుమారు లక్ష ఎకరాలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద తాము అర్హులమని చాలామంది క్లెయిమ్‌ చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రొఫెషనల్‌ స్మగ్లర్‌లైన ముల్తానీలు, ఖమ్మం జిల్లాలో గొత్తికోయలు అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారారు. రకరకాల ముసుగులో అడవిని చెరబడుతున్న వారికి రాజకీయ నాయకులు తోడవుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement