వానాకాలం ప్రయాణాలు.. కొందరికి ఉత్సాహాన్ని అందిస్తాయి. మరికొందరిని అనారోగ్యాల బారిన పడేస్తాయి. మరీ ముఖ్యంగా.. గర్భిణులను మరింత ఇబ్బంది పెడుతాయి. ఈ సమయంలో వాళ్లు అత్యంత జాగ్రత్తగా మెలగాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. ప్రయాణాలు సాఫీగా సాగాలంటే.. కింది జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
డాక్టర్ సలహా మేరకు: గర్భిణులు ప్రయాణాలు చేసేముందు గైనకాలజిస్టును కలవడం తప్పనిసరి. మొదటి, చివరి త్రైమాసికంలో ప్రయాణాలను విరమించుకోవడమే ఉత్తమం. గర్భధారణ సమస్యలు ఉన్నప్పుడు ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. గర్భిణులు ఎక్కడికి వెళ్లినా మెడికల్ రిపోర్టులు, అత్యవసర ఫోన్ నంబర్లను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి.
సరైన రవాణా: వానాకాలంలో రైళ్లు, బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందికరం. విమానంలో ప్రయాణించేటప్పుడు ఎయిర్లైన్స్ నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. గర్భం దాల్చిన 36 వారాల తరువాత విమానంలో ప్రయాణించకపోవడమే మంచిది. సొంత వాహనాల్లో వెళ్లడమే సురక్షితం.
ముందే తెలుసుకోండి: ప్రయాణాలకు సిద్ధమయ్యే ముందే.. వాతావరణ పరిస్థితులను తెలుసుకోండి. వెదర్ యాప్స్, వెబ్సైట్లను పరిశీలించండి. భారీ వర్ష సూచనలు ఉన్నప్పుడు ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది.
సౌకర్యంగా ఉండండి: వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల.. ప్రయాణాల్లో సౌకర్యవంతంగా ఉంటుంది. వాటర్ఫ్రూఫ్ జాకెట్లు, గొడుగు కూడా వెంట ఉంచుకోవాలి. తడిగా ఉన్న చోట జారి కిందపడిపోకుండా.. యాంటి స్లిప్ చెప్పులు వాడండి.
శుభ్రత పాటించాల్సిందే: వానాకాలంలో ఎక్కువగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే, పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు, టవల్స్, టిష్యూలు, టాయిలెట్ సీట్ డిస్ ఇన్ఫెక్టెంట్ స్ప్రే వెంట ఉంచుకోండి. పబ్లిక్ టాయిలెట్లకు వీలైనంత దూరంగా ఉండండి.
సమతుల ఆహారం: వానాకాలంలో బయటి ఆహారం తినకపోవడం మంచిది. ముందుగానే కోసిపెట్టుకున్న పండ్లు, సలాడ్లు, మూతలేకుండా ఉంచిన ఆహారం తినడం మంచిది కాదు. నూనె, మసాలాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే.. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఛాతీలో మంట, అజీర్ణం వంటివి ఇబ్బంది పెడతాయి. పరిశుభ్రమైన వాతావరణంలో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.