హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ):ఉత్తమ పనితీరు కనబర్చే పోలీసు సిబ్బందికి సేవా పురస్కారాల ఎంపికలో అత్యంత పారదర్శక విధానాన్ని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అమలు చేస్తున్నారు. సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు గుర్తించి, దాన్ని విశ్లేషించేందుకు సీసీటీఎస్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్) సాంకేతికతను ఇప్పటికే వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంకేతికతను మరింత అత్యాధునీకరించడంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఒకవైపు కేసుల నమోదు, నేరాల దర్యాప్తు, శిక్షల శాతాన్ని పెంచుతూ శాంతిభద్రతలు తదితర అంశాల నిర్వహణలో సిబ్బంది పనితీరును అంచనా వేస్తున్నారు. సిబ్బంది వ్యక్తిగత వివరాలు, వారి సర్వీస్ సంబంధ అంశాలతో కూడిన హెచ్ఆర్ఎంఎస్(హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను సైతం సీసీటీఎన్ఎస్తో అనుసంధానిస్తున్నారు. దీంతో ఉత్తమ పనితీరు కనబర్చే సిబ్బందికి పురస్కారాలు దక్కనున్నాయి.
అదేవిధంగా పోలీస్ స్టేషన్లను కేసుల నమోదు సంఖ్య ఆధారంగా నాలుగు క్యాటగిరీలుగా విభజించారు. ఇలా ప్రతి యూనిట్ నుంచి నలుగురు ఉత్తమ అధికారులను గుర్తిస్తున్నారు. సిబ్బంది పని విభజన, అత్యుత్తమ పనితీరు, వయసు, ర్యాంకులు తదితర అంశాలవారీగా ఎంపిక ప్రక్రియకు చర్యలు తీసుకొంటున్నారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో అధికారుల అభిప్రాయాలు తీసుకుని తుది అర్హులను గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇస్తున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.