మోడ్రన్ మార్కెట్లో గోండుల హస్తకళల తయారీకి శిక్షణ
గోండుల ఐదు కుటుంబాలతో ఐదు రోజుల వర్క్‌షాపు, ప్రత్యేక శిక్షణ
సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) హైదరాబాద్‌లోని డిజైనింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ రాజ్గోండ్ల జీవన విధానం, వారి హస్తకళలపై పరిశోధన చేస్తూ డాక్యుమెంటరీతో అనేక విషయాల్ని వెలుగులోకి తెచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్ గోండు, ఓజా గోండు, ఇతర ఆటవిక మానవ జాతులకు సంబంధించిన వారి జీవన విధానం, సంస్కృతి, హస్తకళలపై నిర్వహిస్తున్న పరిశోధనలో భాగంగా అనేక కొత్త అంశాలను బహిర్గతం చేశారు. ఇందుకు గాను గోండు జాతులకు చెందిన ఐదు కుటుంబాలతో ఐదు రోజుల పాటు వర్క్‌షాపు నిర్వహించారు. ‘టాంజిబుల్ అండ్ ఇంటాజిబుల్ కల్చర్ హెరిటేజీ సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇనిషియేటీవ్ ప్రొగ్రామ్, డిజైన్ ఇన్నోవేషన్‌లో భాగంగా సెంటర్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాపునకు రాజ్‌గోండు, ఓజా గోండు, ఇతర జాతులకు చెందిన కుటుంబాలను ఆహ్వానించారు. వారు తయారు చేసే హస్తకళల వంటి 40 రకాల ఉత్పత్తులను గుర్తించారు. వాటిలో యువతకు పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వడంతో పాటు వాటిని తయారు చేయడానికి తన సహాయ సహకారాలు అందించే విధంగా పరిశోధనలు చేస్తున్నామని ప్రొఫెసర్ దీపక్ జాన్ తెలిపారు.