తమిళ కథానాయకుడు విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకుడు. విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంపై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను నటుడు నాని విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. అబూ బక్కర్ అబ్దుల్లా అనే ఉగ్రవాది కారణంగా ఇర్షాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయనేది ఈ చిత్రకథ. తీవ్రవాదుల ఆటకట్టించే ఆఫీసర్గా దర్శకుడు గౌతమ్వాసుదేవ్ మీనన్ కనిపిస్తారు’ అన్నారు. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.