నగరవాసుల నెత్తిన ట్రాఫిక్ పోలీసులు డబుల్ చలాన్లతో రెట్టింపు భారం వేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా హెల్మెట్ లేకుంటే రూ. 200, రాంగ్ రూట్లో ప్రయాణిస్తే రూ. 2 వేల జరిమానా విధిస్తున్నారు. 2019లోనే కేంద్రం జరిమానాలు పెంచినా, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయలేదు, అప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించారు. దీంతో పాటు వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడకుండా, విస్తృతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలను వందశాతం అధికం చేసి రెట్టింపుగా వసూలు చేస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హెల్మెట్ ధరించని వారు, రాంగ్రూట్లో ప్రయాణించే వారిపై మంగళవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సోమవారం వరకు హెల్మెట్ లేని వారికి రూ. 100, రాంగ్రూట్లో ప్రయాణిస్తే రూ. 1000 వరకు జరిమానా విధిస్తూ వచ్చారు. మంగళవారం నుంచి జరిగే స్పెషల్ డ్రైవ్‌లో హెల్మెట్ ధరించని వారికి రూ. 200, రాంగ్రూట్లో ప్రయాణిస్తే రూ. 2 వేల జరిమానా విధిస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించి, అమలులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. 2019లో కేంద్రం భారీగా జరిమానాలు పెంచుతూ చట్టాన్ని చేసింది, అయితే దానిని ఇప్పుడు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిరోజూ కనీసం 18 వేల వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదవుతున్నాయి. వీటిని పెంచడంతో పాటు ధరలను కూడా పెంచడంతో రెట్టింపు ఆదాయం వస్తుందనే ఆలోచన జరుగుతుందా? ప్రస్తుతం హెల్మెట్, రాంగ్రూట్లకు జరిమానాలను పెంచి, నెమ్మదిగా మరింత భారం ప్రజలపై వేసేందుకు ఏవైనా సన్నాహాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు జరిమానాలపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పెట్టడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీతో ప్రతి నిత్యం వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదని, అలాంటిది జరిమానాలు వసూలు చేసుకోవడం, పెంచడం పైనే పోలీసులు, ప్రభుత్వం దృష్టి పెట్టిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చలాన్లు రెండింతలు..!
మోటార్ వాహనాల చట్టం ప్రకారం కనిష్ఠం, గరిష్ఠంగా జరిమానాల రేట్లు ఉన్నాయి. అయితే పోలీసులు చలాన్ల నుంచి ఎక్కువ ఆదాయం రాబట్టేందుకు ప్రణాళిక చేపట్టారు. గతంలో కనిష్ఠం ఏదుంటే దానిని జరిమానాగా విధించేవారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చలాన్లు పడకుండా వాహనదారులు చూసుకోవాలంటూ జాగ్రత్తలు చెప్పేవారు. ఒక చలానా పడిందంటే, మరో చలానా పడకుండా వాహనదారులు జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటించేవారు. ఈ క్రమంలోనే రిపీటెడ్‌గా ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి వారికి కొన్నిసార్లు జరిమానాలు పెంచేవారు. నేడు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండా, ట్రాఫిక్ రద్దీలో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ పండుగలు, పబ్బాలు అని కూడా చూడకుండా చలాన్ల వసూళ్లే ధ్యేయంగా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తూ, అసలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయాన్ని మర్చిపోయారంటూ నగర వాసులు వాపోతున్నారు. ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించకపోవడం, రోడ్లపై విజుబుల్ పోలీసింగ్ కన్పించకపోవడంతో వాహనదారులు కూడా కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలున్నాయి.
ప్రమాదాలు జరగకుండా చర్యలు
నగరంలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వారితో పాటు రాంగ్రూట్లో వెళ్తున్న వారితోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల వరుసగా మూడు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవారు. హెల్మెట్ ఉంటే ప్రమాదం సంభవించినప్పుడు 80 శాతం వరకు ప్రాణాలతో బయటపడే అవకాశాలుంటాయి. అయితే ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతోనే హెల్మెట్, రాంగ్రూట్లకు గరిష్ఠంగా రూ. 200, రూ. 2 వేల జరిమానా వేయాలని ఆదేశించాం. మేం కొత్తగా ఏదీ అమలు చేయడం లేదు, ఉన్న జరిమానాలనే అమలు చేస్తున్నాం. 2019 కేంద్రం పెంచిన జరిమానాలకు, మేం చేపట్టిన డ్రైవ్‌కు ఎలాంటి సంబంధం లేదు.
-ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్