వాషింగ్టన్, ఏప్రిల్ 7: పై చదువుల కోసం మనవాళ్లు ఎక్కువగా అమెరికా వైపే మొగ్గు చూపుతున్నారు. గణాంకాల ప్రకారం అమెరికాలోని విద్యాసంస్థల్లో 2021లో చేరిన మన విద్యార్థుల సంఖ్య దాదాపు 12 శాతం పెరిగింది. అదేసమయంలో చైనా నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య 8 శాతానికిపైగా తగ్గింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తన వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. విదేశీ విద్యార్థుల రాకపై కొవిడ్ ప్రభావం ఇంకా ఉంటున్నట్టు నివేదిక తెలిపింది. 2021లో 12,36,748 మంది ఎఫ్-1, ఎం-1 వీసా విద్యార్థులు అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరారని వివరించింది.2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి 33,569 మంది విద్యార్థులు తక్కువగా వెళ్లారని, భారత్ నుంచి మాత్రం 25,391 మంది వెళ్లారని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వెళ్తున్న దేశాల్లో చైనా (3,48,992 మంది) మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ (2,32,851 మంది) ఉంది.