హైదరాబాద్ : గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. అన్నమయ్య కీర్తనను అందాన్ని అభివర్ణించుకునేందుకు ఉపయోగించడంపై ఆయన కుటుంబ సభ్యులు, శ్రీవారి భక్తులు సింగర్పై మండిపడుతున్నారు. తెలుగులో అనేక పాటలు ఆలపించి మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న శ్రావణ భార్గవి హేమచంద్రను ప్రేమించి వివాహం చేసుకొని, కొన్నాళ్ల క్రితమే విడాకులు తీసుకోబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనతో కూడిన ఒక ఆల్బమ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ ఏసింది.
తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ‘ఒకపరి వయ్యారమే’ అనే పాటను ఒక ఫ్యూజన్గా చిత్రీకరించిన ఆమె అందులో తన అందాన్ని అభివర్ణించుకునే విధంగా చిత్రీకరించింది. ఈ విషయం అన్నమయ్య కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో అన్నమాచార్యుల పాటను వెకిలిగా చిత్రీకరించి.. ఆయనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట విడుదల చేసి రెండురోజులవుతున్న నేపథ్యంలో అన్నమాచార్యులు అభిషేకం సమయంలో వేంకటేశ్వర స్వామిని స్మరిస్తూ భక్తిపారవశ్యంతో మునిగి తేలిన అనుభూతి కోసం రాసిన పాటను శ్రావణ భార్గవి తన అందాన్ని వర్ణించడం కోసం వాడడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నమాచార్యులు పెద్ద కుమారులు పెద్ద తిరుమల ఆచార్యులు సాక్షాత్తు స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ కీర్తించిన పాటను ఆమె కాళ్లు ఊపుతూ.. వివిధ భంగిమల్లో చూపిస్తూ చిత్రీకరించడం చాలా బాధగా ఉందన్నారు. అందాన్ని వర్ణించుకోవడం కోసం అన్నమాచార్యుల కీర్తనను ఉపయోగించడం పొరపాటని అన్నమయ్య కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ఆమె వివరణ కోరడానికి వారు ప్రయత్నించగా.. మీ కళ్లల్లోనే ఏదో తేడా ఉందని బాధ్యతరాహిత్యంగా సమాధానం ఇచ్చినట్లు అన్నమయ్య వంశస్థులు తెలిపారు.
సినీ పరిశ్రమకు చెందిన ఎవరైనా అన్నమాచార్య కీర్తన తీసుకుంటే తిరు వెంకటచలపతి అనే ముద్రతో కీర్తన ముగిస్తారని.. కానీ, శ్రావణ భార్గవి మాత్రం అలా చేయలేదని పేర్కొన్నారు. అది ఒక శృంగార కీర్తన అని మేము ఎందుకు పాట చేయకూడదు అని ఆమె ఎదురు ప్రశ్నిస్తోందని, చాలా మంది ఆ పాటను తొలగించమని కోరడంతో అసలు ఆ పాట తొలగించకుండా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిందని తాళ్లపాక వెంకట రాఘవ అన్నమాచార్యులు వాపోయారు. దీంతో ఈ విషయం ఎటూ వైపు మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.