ఇన్ 1978వన్ సైన్మా రిలీజ్డ్నేమ్.. ‘లైఫ్ కాస్ట్’.. సమజ్ కాలే.. గదేవయ్ ‘ప్రాణం ఖరీదు’. ఇన్ టైటిల్ కార్డ్స్ .. నో సర్ నేమ్.. ఓన్లీ శ్రీనివాసరావు నేమ్ కేమ్..ఫైవ్ ఇయర్స్ గాన్. నో బిగ్ మూవీ.. నో బిగ్ నేమ్.. టూ త్రీ ఇస్మాల్ క్యారెక్టర్స్ ఓన్లీ డిడ్..వేర్ ఈజ్ ఫ్యూచర్…గప్పుడొచ్చింది.. ‘ప్రతిఘటన’ ఇన్ 1985 కోటయ్య టైమ్ స్టార్టెడ్. కోట నటనకు పెట్టని కోట అనిపించుకున్నడు. నటన కోసమే పుట్టిన కోట అనిపించుకున్నడు. శ్రీనివాసరావు.. సిల్వర్ ‘స్క్రీన్’వాసరావు స్థాయికి చేరుకున్నడు. ‘గిదేం ఇంట్రొడక్షన్రా బాబూ..!’ అని కోట స్టయిల్లో ఇదైపోకండి..చార్మినార్‌కున్నంత హిస్టరున్న ఒక విలక్షణ నటుడి పరిచయం ‘ఏ శభాష్.. శభాష్.. శభాష్..’ అనిపించే రేంజ్లో కాకపోయినా.. ‘థాంక్స్’ అన్నట్టయినా ఉండాలిగా!!
రావు గోపాల రావు పీక్స్‌లో ఉన్న టైమ్ అది. కైకాల సత్యనారాయణ నవరసాలు ఒలికిస్తూనే ఉన్నాడు. నూతన్ ప్రసాద్ చేతిలో నూటొక్క సినిమాలకు తక్కువ లేవు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గొల్లపూడి, ప్రభాకర్ రెడ్డి మాంచి బూమ్‌లో ఉన్నారు. ఇందరు మాటేసిన చోట తన వాటా వెతుక్కుంటూ కోట వెండితెర రంగప్రవేశం చేశాడు.‘ప్రతిఘటన’ స్క్రిప్ట్‌లో మొదట కోట పోషించిన కాశయ్య పాత్ర నిడివి చాలా చోటాగా అనుకున్నారట. కెమెరా ముందు ఈయనగారి వాటం చూశాక డైరెక్టర్ టి.కృష్ణ ఆయన కోటాను పెంచేశాడట. ‘అవ్ మరి.. తెలంగాణ స్లాంగ్ల గప్పటి వరకు గింత పర్ఫెక్ట్గా డైలాగ్ చెప్పినోడు ఇండస్ట్రీలనే లేడు మరి’! ఈ సినిమా తర్వాత కూడాను పాత్రలేం వెతుక్కుంటూ రాలే! స్ట్రగుల్స్ కంటిన్యూడ్!!
‘అహ నా పెళ్లంట’లో పరమ పీనాసి ‘లక్ష్మీపతి’ క్యారెక్టర్లో తనలోని నటనా చాతుర్యాన్ని ఏ మాత్రం దాచుకోకుండా ప్రదర్శించేశాడు మన కోట. మొత్తానికి బ్యాంకు ఉద్యోగిగా క్యాష్ లెక్కపెట్టాల్సిన కోట… ఒక్కో కాల్షీట్కు ఇచ్చే క్యాష్ లెక్కపెట్టుకోలేనంత బిజీగా మారిపోయాడు. వరుస సినిమాలు. మూడేసి షిఫ్ట్‌లు. ముచ్చటైన క్యారెక్టర్లు. దర్శకులకు తమ ప్రతిభ చాటుకునే గీటురాయి దొరికినట్టయింది. రచయితలకు తమ మాటల్లో భావాన్ని నింపే భావకుడు లభించినట్టయింది. ఇంకేముంది.. కోటను జంధ్యాల కామెడీగా వాడుకున్నాడు. కోదండరామిరెడ్డి కొత్త విలన్ దొరికాడు అనుకున్నాడు. వంశీ వింత పాత్రల్లో చూపించాడు. ఈవీవీ అయితే కోటతో ఏవేవో పాత్రలు వేయించాడు. కోడిరామకృష్ణ నుంచి త్రివిక్రమ్ వరకు.. ఆయనుంటే సినిమాకు ప్లస్ అనుకునేవారు.
చేతి నిండా సినిమాలు.. నిద్ర పోవడానికి వీల్లేనంత బిజీ అయ్యాడు కోటయ్య. ఏడాదికి ముప్పయ్ నలభై సినిమాలు. అలా కనిపించి ఇలా మాయమయ్యే చిన్నా చితకా రోల్స్ కాదు. విలనీ చేసినా, కమెడియన్‌గా నటించినా, సైడ్ క్యారెక్టర్ అయినా… ఫుల్‌లెంగ్త్ ఉండాల్సిందే!! దానికితోడు అతగాడికో జతగాడు కావాల్సిందే!! ఆ చెలికాడు మరెవరో కాదు బాబుమోహన్. కోట ఇమేజ్‌కు సరిపోయే కరేజ్ ఉన్న యాక్టర్.
ఈ కామెడీ టింజ్ను కాసేపు పక్కనపెడితే.. హీరోలకూ తమ సినిమాలో కోట ఉండాలి. చిరంజీవికి సరైన విలన్ కావాలి.. కోట ఉన్నాడుగా! చిరు కామెడీ టైమింగ్‌కు సరిగ్గా రెస్పాండయ్యే పాత్ర కావాలి.. మళ్లీ మన కోటనే! బిగ్‌బాస్‌లో కన్నింగ్ విలనీ చేసినా.. ‘అన్నయ్య’లో ఫన్నింగ్ పంచ్‌లు విసిరే బాబాయ్‌గా నటించినా, ‘బావగారు బాగున్నారా!’లో చురుకు చిరుకు బ్రేకులు వేసే ప్రయత్నంలో బోల్తా పడినా.. అవన్నీ అక్కడ కోట ఉండబట్టి వర్కవుట్ అయ్యాయి. ఇక బాలయ్య దగ్గరికొస్తే.. ఆయన స్పీడ్‌కు ఈయనైతేనే జోడి అనిపించుకున్నాడు. నాగార్జున ‘హలోబ్రదర్’ ఎలా మర్చిపోతాం. టైటిల్ మర్చిపోయినా.. అందులో మన కోట వేసిన తాటి మట్టయ్య క్యారెక్టర్ ఎట్ల యాది మరుస్తం. ‘ఏంట్రా ఆ చూపు..’, ‘ఈన్నటేసుకొని.. ఆన్నిటేసుకో..’ లాంటి డైలాగ్స్ మేకప్ వేసుకున్న ప్రతి ఆర్టిస్టూ చెప్పగలడు. కానీ, ఆ రెండు ముక్కలు డిఫరెంట్ డైనమిక్స్‌లో, పర్ఫెక్ట్ టైమింగ్‌తో పలికే నటుడు మాత్రం మన శ్రీనివాసరావే!
వెంకటేశ్, కోట కాంబో అబ్బో అదుర్స్. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ‘వారసుడొచ్చాడు’ నుంచి మొదలుపెడితే… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వరకు వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్.. ప్లజెంట్‌గా అనిపిస్తుంది. ‘శత్రువు’ సినిమాలో కోట కొత్త విలనిజాన్ని పరిచయం చేశాడు. ‘గణేష్’లో ఆరోగ్యశాఖ మంత్రిగా కోట నటన పరాకాష్ఠకు చేరిందనిపిస్తుంది. ‘పెహలా మర్డర్ ఎప్పడు చేసిన్నో ఎర్కనా..’ అని తన క్యారెక్టర్ ఎంత వరెస్ట్దో చెబుతూ బెదిరిస్తూనే.. ‘గిదైతే బ్లాంక్ చెక్ అన్నట్టు.. నన్నిడ్సేయరాదె’ అని బతిమాలుకునే తీరు.. ఆయనలోని నటనా వైదుష్యానికి తార్కాణంలా కనిపిస్తుంది.
క్యారెక్టర్ మరీ డిమాండ్ చేస్తే తప్ప కోట పేజీలకు పేజీలు డైలాగులు కొట్టడు. సింపుల్ అండ్ స్వీట్ బాపతే ఎక్కువగా ఉంటాయి. పలికే ప్రతీ మాట పంచ్లా ఉంటుంది. కౌంటర్ ఇచ్చాడంటే అవతలి క్యారెక్టర్ ఎన్కౌంటర్ అయిపోవాల్సిందే! ఎదుటి పాత్ర పోషిస్తున్న నటుడు సాదాసీదాగా డైలాగులు చెబుతున్నా.. కోట మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. సందు దొరికితే చాలు.. మాటలో డైనమిక్స్, ఫేస్‌లో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంటాడు. ‘అతడు’ సినిమాలో మహేశ్‌బాబుతో ఫోన్ సంభాషణలో బాజిరెడ్డిగా కోట చెప్పే ఒక్కో మాటలో ఒక్కో ఎక్స్ప్రెషన్ పలుకుతుంది.
కొన్ని క్యారెక్టర్స్‌లో కోట కిరాతకంగా కనిపించాడు. ఇంకొన్ని పాత్రల్లో పరమ చిల్లరగా అలరించాడు. మరికొన్ని రోల్స్‌తో హుందాగా పలకరించాడు. ఏ క్యారెక్టర్ చేసినా.. ఆయన మాత్రమే చేయగలడు అనిపించుకున్నాడు. కన్నింగ్ పాత్రలు చేయడం కోటకు కొట్టిన పిండి. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాంబంటు’ పెద్దగా హిట్ కాలేదు కానీ, గిరీశంగా అందులో కోట వేసిన వేషాలు ఆ క్యారెక్టర్‌పై కో పం తెప్పిస్తాయి. అదే సమయంలో దాన్ని పోషించిన కోట మీద అభిమానం మరోసారి కట్టలు తెంచుకునేలా చేస్తాయి. ‘ఇడియట్’లో రవితేజ తండ్రి కానిస్టేబుల్ వెంకటస్వామి పాత్ర కోటలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హాసిని ఫాదర్‌గా మళ్లీ మన మనసులు గెలుచుకున్నాడు కోట. ‘సత్యం’ లో గుడ్ఫాదర్.. ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’లో వెరైటీ ఫాదర్, ‘మా నాన్నకు పెళ్లి’లో అల్లరి ఫాదర్‌గా, ‘ఆమె’లో బ్యాడ్ ఫాదర్ కమ్ అంకుల్‌గా, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో బోల్డ్ ఫాదర్‌గా.. ఇలా ఆయన పోషించిన తండ్రి పాత్రలు.. ఫాదర్ రోల్‌కు ఓ పారామీటర్ ఫిక్స్ చేశాయి. దాదాపు నాలున్నర దశాబ్దాల సినీకెరీర్‌లో ఆయన చేసిన సినిమాలు 750కి పైగానే ఉంటాయి. వాటిలో కొన్ని హీరో కారణంగా ఆడొచ్చు. కథ ఆధారంగా మంచి టాక్ తెచ్చుకొని ఉండొచ్చు. ఇంకొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడొచ్చు. కథ పరంగా ప్రేక్షకులను నిరాశపరచొచ్చు. కానీ, ఇన్ని సినిమాల్లో కోట మాత్రం ఒక్క సీన్లోనూ ప్రేక్షకులను నిరాశపరచలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే… ఆయన నటనకు పెట్టిన కోట. నటన కోసమే పుట్టిన కోట!! – కణ్వస
విలక్షణ నటనకు చిరునామా
పాత్రలను ప్రతి నటుడూ పోషిస్తాడు. కానీ వాటికి చిరంజీవత్వాన్నిచ్చే నటులు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటుడే కోట శ్రీనివాసరావు. ఆయన నటించిన పాత్రలే కాదు, వాటి పేర్లు కూడా ఆడియన్స్‌కి కంఠోపాఠమే. దశాబ్దాల క్రితం కోట నటించిన పాత్రలు నేటికీ ఆడియన్స్‌కి ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి. దాదాపు 800 సినిమాల్లో ఆయన నటిస్తే అందులో అద్భుతాలు కోకొల్లలు. వాటిలో మచ్చుకు కొన్నింటిని గుర్తు చేసుకుందాం.
అల్లాద్దీన్ (మనీ)
‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ.. భర్తగ మారకు బ్యాచిలరూ..’ అంటూ ‘మనీ’ సినిమాలో బ్యాచిలర్స్కి హితబోధ చేసిన అల్లాద్దీన్ని తేలిగ్గా మరిచిపోగలమా.. నటుడి గా కోటలోని కొత్త కోణా న్ని ఆవిష్కరించింది అల్లాద్దీన్ క్యారెక్టర్. ఇందు లో ఆయన బట్లర్ ఇంగ్లిష్ తో ఆడియన్స్ పొట్ట చెక్కల య్యేలా నవ్వించారు.
గుడిసెల కాశయ్య (ప్రతిఘటన)
1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ నటుడిగా కోటా శ్రీనివాసరావు తొలి సినిమా కాగా.. ఆ తర్వాత ఏడేళ్లకు వచ్చిన టి.కృష్ణ ‘ప్రతిఘటన’ కోటకు తొలి బ్రేక్. అందులో ఆయన మినిస్టర్ గుడిసెల కాశయ్యగా అదరగొట్టడమేకాదు, తెలుగుతెరపై తెలంగాణ మాండలికాన్ని పర్ఫెక్ట్గా పలికిన తొలి నటుడుగా కితాబులందుకున్నారు. ఆ పాత్ర కోసమే పట్టుబట్టి మరీ తెలంగాణ మాండలికాన్ని నేర్చుకున్నారాయన. విలన్ కాళీ(చరణ్‌రాజ్) చేసే అరాచకాలకు అండగా నిలిచే అవినీతి మంత్రిగా కోట నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందులో ఆయన పలికిన ‘అందరికీ పెడతాండ.. దండం..’ డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్.
లక్ష్మీపతి (అహ నా పెళ్లంట)
జంధ్యాల ‘అహనా పెళ్లంట’ కోటకు రెండో బ్రేక్. ఇందులో పీనాసి లక్ష్మీపతిగా కోట అభినయం వందేళ్లు గుర్తుండిపోతుంది. కోడిని ఎదురుగా వేళ్లాడగట్టి, దాన్ని తదేకంగా చూస్తూ.. కోడి కూర తింటున్న అనుభూతిని పొందే సన్నివేశంలో కోట అభినయం ఎన్నటికీ మరిచిపోలేం. కాళ్లకూరి నారాయణరావు రచించిన ‘వరవిక్రయం’ నాటకంలోని సింగరాజు లింగరాజు పాత్రను ప్రేరణగా తీసుకొని జంధ్యాల రాసిన ఈ పాత్రకు కోట ప్రాణం
పోశారు.
మాచిరాజుగా ‘శివ’లో, పోతరాజుగా ‘మామగారులో’, తాటి మట్టయ్యగా ‘హలోబ్రదర్’లో, అల్లరి తండ్రిగా ‘ఇంట్లో ఇల్లాలు-వంటిట్లో ప్రియురాలు’లో, ఆటపట్టించే తాతగా ‘మా నాన్నకు పెళ్లి’లో, తాగుబోతుగా ‘గబ్బర్‌సింగ్’లో ఇంకా.. ఆడవారి మాటలకు అర్థాలేవేరులే, బొమ్మరిల్లు చిత్రాల్లో మధ్య తరగతి తండ్రిగా, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో..
కోటను తెరపై విలన్‌గా చూస్తే.. ఇంతకు మించిన దుర్మార్ఘుడు మరొకరుండరేమో అనిపిస్తుంది. కమెడియన్‌గా చూస్తే ఇంతకు మించి ఎవరూ నవ్వించలేరేమో అనిపిస్తుంది. అదే గుణచిత్రనటుడు(క్యారెక్టర్ ఆర్టిస్ట్)గా అభినయిస్తే మంచికి మారుపేరుగా కనిపిస్తారు. మొత్తంగా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రగా మారిపోయే అభినయ జలం కోట శ్రీనివాసరావు. విశిష్టమైన విలక్షణమైన నటనకు ఆయనే చిరునామా.
ఏదేమైనా ఓ అభినయ శిఖరం ఒరిగిపోయింది. ఓ సినీ ధృవతార పంచభూతాల్లో ఐక్యమై అదృశ్యమైంది. మహానటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు భౌతికత్వాన్ని వదిలేశారు. జ్ఞాపకంగా మిగిలిపోయారు.
నల్ల శీను (రక్షణ)
‘రక్షణ’ సినిమాలో కోట ‘నల్ల శీను’ అనే విలన్ పాత్ర పోషించారు. ఈ పాత్ర నరాల వీక్నెస్ కారణంగా తల నిరంతరం వణుకుతూనే ఉంటుంది. చాలా కష్టతరమైన పాత్ర ఇది. కానీ ఎక్కడా టైమింగ్ మిస్సవ్వదు.
సాంబశివుడు (గణేష్)
ప్రజల రక్తం తాగే మంత్రి సాంబశివుడుగా ‘గణేష్’ సినిమాలో నటించారు కోట. ఇందులోని వెంకటేశ్‌కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం కోట ఎంత గొప్ప నటుడో చెబుతుంది. ఆయన ఆహార్యం కూడా భయంకరం గా ఉంటుంది. గుండుతో, భయంకరమైన కళ్లతో వణుకు పుట్టించారు కోట.
వెంకటరత్నం(శత్రువు)
‘ఈ ఫోనెవరు కనిపెట్టార్రా బాబూ..’ అంటూ ‘శత్రువు’ సినిమాలో విలన్ వెంకటరత్నంగా కోట చూపించిన అభినయం అనితరసాధ్యం. మేకతోలు కప్పుకున్న పులి తరహా పాత్రలకు రక్తకన్నీరు నాగభూషణం కొత్తందం తీసుకురాగా, రావుగోపాలరావు ఆ తరహా పాత్రలకు ఆ తర్వాత మరింత వన్నెనద్దారు. ‘శత్రువు’లో వెంకటరత్నంగా కోట శ్రీనివాసరావును చూసిన ప్రేక్షకులు రావుగోపాలరావు వారసుడు ఇతడే అంటూ వెండితెర ప్రతినాయకుడిగా కోటకు పట్టం గట్టేశారు.
గురునారాయణ (గాయం)
‘గదైతే నేను ఖండిస్తన్న..’ అంటూ రామ్‌గోపాల్‌వర్మ ‘గాయం’లో గురునారాయణ్గా కోట చేసిన సందడి అంతాఇంతాకాదు. జగపతిబాబుని సోలో హీరోగా నిలబెట్టిన ఈ సినిమాలో గురునారాయణ్గా కోట అభినయం అదుర్స్. ఇందులోనూ ఆయన తెలంగాణ మాండలికాన్నే ఆయుధంగా వాడారు.
రాచకొండ లచ్చన్న (అలెగ్జాండర్)
కేవలం కోట శ్రీనివాసరావు వల్ల విజయం సాధించిన సినిమా సుమన్ ‘అలెగ్జాండర్’. అందులో రాచకొండ లచ్చన్నగా కోటా అభినయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. మాఫియా డాన్‌గా ఆ సినిమాలో నట విశ్వరూపాన్నే
చూపించారు కోట.
‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను మొదలుపెట్టాం. అనంతరం కోటగారు ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి, తనదైన విలక్షణ శైలితో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. సహాయ నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా..ఇలా ఏ పాత్రలోనైనా పరిపూర్ణత కనబరిచి మెప్పించారు. కోట శ్రీనివాసరావుగారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు’
– చిరంజీవి.
‘కోట శ్రీనివాసరావుగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నా తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలుగు తెరపై విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణ పాత్రలు పోషించారు. తెలుగు భాష, యాసపై ఆయనకు మంచి పట్టుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’
-పవన్‌కల్యాణ్
‘మేమిద్దరం కలిసి వందల సినిమాల్లో నటించాం. కోట శ్రీనివాస రావు నటరాజపుత్రులు. నటన ఉన్నంత కాలం ఉంటారు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లా డే వ్యక్తి. మేమిద్దరం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కలిసి పనిచేశాం’
– బ్రహ్మానందం
‘ఇండస్ట్రీలోని అతికొద్ది మంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావుగారు ఒకరు. ఆయన నటన వల్ల శివ, గాయం, మనీ, సర్కార్, రక్తచరిత్ర వంటి సినిమాలు మరింత ఎఫెక్టివ్‌గా వచ్చాయి. కోట శ్రీనివాసరావుగారు.. మీరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా మీరు పోషించిన పాత్రలు బతికే ఉంటాయి’
– రామ్‌గోపాల్‌వర్మ