గుమ్మడిదల, డిసెంబర్27: జాతీయ రహదారి 765డీ గుమ్మడిదల-బొంతపల్లి టోల్ ప్లాజా నిర్వాహకులపై స్థానిక యువకులు దాడి చేశారు. గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి గుమ్మడిదల గ్రామానికి చెందిన పోతారం ప్రవీణ్‌రెడ్డి తన వాహనంతో టోల్గేట్ నుంచి వెళ్లాడు. దీంతో ఫాస్ట్‌ట్యాగ్‌తో తన కారుకు అదనంగా ఫీజు వసూలు అయ్యాయని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. టోల్గేట్ నిర్వాహకులు దుసురుగా ప్రవర్తించారని నెపంతో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రవీణ్‌రెడ్డి కొంతమంది యువకులతో కలిసి టోల్గేట్ వద్దకు వచ్చి గొడవకు దిగాడు. నిర్వాహకుడు కాలుసింగ్ సర్దిచెప్పబోగా, యువకులు ఆయనపై దాడి చేశారు. టోల్ గేట్ క్యాబిన్ అద్దాలను పగులగొట్టి గందరగోళం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకొని, సమస్యను సద్దుమణిగిపించారు. టోల్ ప్లాజా నిర్వాహకులు కాలుసింగ్ ఫిర్యాదు మేరకు దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.