సిద్దిపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఉజ్వల ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కాబోతున్నది. 50 టీఎంసీల అతి పెద్దదైన మల్లన్నసాగర్ జలాశయాన్ని అపర భగీరథుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం జాతికి అంకితం చేయబోతున్నారు. మధ్యా హ్నం మల్లన్నసాగర్ రిజర్వాయర్ దగ్గరకు చేరుకొని ముందుగా టన్నెల్ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్‌చేసి పైన డెలివరీ సిస్టర్న్ దగ్గర పూజలు నిర్వహించి గోదావరి జలాలను రిజర్వాయర్‌లోకి విడుదలచేస్తారు. ఇప్పటి వరకు ట్రయల్న్ చేసి 10 టీఎంసీల వరకు నీటిని నిల్వచేశారు. రిజర్వాయర్‌లో సామర్థ్యానికి అనుగుణంగా క్రమంగా నీటినిల్వలను పెంచుతారు. ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
చిచ్చుపెడుతున్న బీజేపీ
బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి మత ఘర్షణలు రేపి రక్తం పారించాలని కుట్రచేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘అభివృద్దిని స్వాగతించాలా.. వద్దా.. మీరే ఆలోచించుకోవాలి. మల్లన్నసాగర్ మీద వందల కేసులు పెట్టి ప్రాజెక్ట్‌ను ఆపాలని చూశారు. మీరు ఎన్ని చేసినా కష్టపడి ఇంత వేగంగా నిర్మించి నీళ్లు తెచ్చాం. కూడవెళ్లిలో మండుటెండల్లో చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతుంటే పిల్లలు ఈతలు కొట్టారా.. లేదా? మంచి పంటలు పండించుకున్నామా లేదా? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన విజయం’ అని హరీశ్ అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మీద.. అభివృద్ధి మీద దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన ఒక్కదాన్ని కూడా వారు సాధించలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని నిలదీశారు. బీజేపీ నేతలు రాష్ర్టాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకొస్తే.. విమానాశ్రయంలోనే దండలు వేసి బీజేపీ నేతలను ఘనంగా స్వాగతిస్తామన్నారు. ‘మీకు ప్రజల కోణం లేదు. పాచిపోయిన పాకిస్తాన్ పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి పాలమూరు గోస తీర్చాలని కేసీఆర్ కల కంటున్నారు. మాది పాలమూరు గోస.. మీది పాకిస్తాన్ భాష.. ఇంతకంటే మీరు ఏమీ చేయలేరు. మీరు అవార్డులు మాత్రమే ఇస్తరు. నిధులు ఇవ్వరు’ అని మంత్రి హరీశ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మల్లన్నసాగర్ చాలా ముందు చూపుతోని కట్టిన ప్రాజెక్ట్ అన్నారు. వందేండ్ల ముందుకు ఆలోచించి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారన్నారు. వందల కోట్ల పంట పండించి తొలి ఫలితం అందుకొంటున్న ఈ అపూర్వ సందర్భం వెనుక నిరంతర కృషి ఉన్నదని మంత్రి హరీశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, నాయకులు మాదాస్ శ్రీనివాస్, దేవీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నదిలేని చోట కట్టిన అతి పెద్ద రిజర్వాయర్
భారతదేశంలోనే నదిలేని చోట కట్టిన అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలకు తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చేలా.. తక్కువ ముంపుతో బాహుబలి ప్రాజెక్టుగా మల్లన్నసాగర్ ర్మాణం జరిగిందన్నారు. రిజర్వాయర్ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకొంటున్నందుకు ఆనందంగా ఉన్నదని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ నడిగడ్డ అయిన సిద్దిపేట జిల్లా తొగుట ప్రాంతానికి నీళ్లు తెస్తే ఎక్కువ జిల్లాలకు నీళ్లు అందించవచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ దూరదృష్టితో స్వయంగా ఇంజినీర్లా రాత్రింబవళ్లు కష్టపడి, ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని ప్రశంసించారు. 22 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నిరంతరంగా మల్లన్నసాగర్‌కు వస్తుందని పేర్కొన్నారు. ‘22 వేల క్యూసెక్కుల నీరు అంటే ఒక నదితో సమానం. కూడవెళ్లి నీళ్లు గోదావరిలో కలవడం చూశాం కానీ గోదావరి నీళ్లను కూడవెళ్లిలో కలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది’ అని కొనియాడారు.