ఏకపక్షంగా సాగుతున్న సిరీస్‌లో మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. వన్డే ఫార్మాట్లో టీమ్ఇండియాకు పోటీనివ్వలేకపోయిన వెస్టిండీస్.. తమకు అచ్చొచ్చిన టీ20ల్లోనూ సత్తాచాటాలని చూస్తుంటే.. ప్రపంచకప్ సన్నాహాలు ప్రారంభించిన రోహిత్ సేన సిరీస్‌పై కన్నేసింది!
కోల్‌కతా: సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శన కనబర్చే టీమ్ఇండియా సిరీస్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన.. అదే జోరులో టీ20 ట్రోఫీ పట్టేయాలని తహతహలాడుతున్నది. బుధవారం జరిగిన తొలి పోరులో 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా.. శుక్రవారం రెండో టీ20 బరిలోకి దిగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు పోటీనిచ్చే స్థాయిలో కరీబియన్లు లేరనేది వాస్తవమే అయినా.. పొట్టి ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి అయిన వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. క్షణాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే ఆటగాళ్లు ఆ జట్టులోనూ ఉన్నారు.
గాయం కారణంగా లోకేశ్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ ఆకట్టుకున్నారు. ఎటొచ్చి విరాట్ కోహ్లీ పేలవ ఆటతీరే టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. రెండేండ్లుగా అంతర్జాతీయ శతకం నమోదు చేయని విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. పవర్‌ప్లేలో రోహిత్ దంచికొట్టి భారత్‌కు శుభారంభం అందించినా.. విరాట్, రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోక పోవడంతో తొలి టీ20 చివరి వరకు సాగింది.
ఈ సారి అలాంటి తప్పిదాలు చేయకుండా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాలని టీమ్ఇండియా చూస్తున్నది. బౌలింగ్ విషయానికి వస్తే యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన గూగ్లీలతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు చేజిక్కించుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బుధవారం ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ దీపక్ చాహర్ పూర్తి స్థాయిలో కోలుకోకపోతే అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రావొచ్చు. అనివార్య మార్పులు తప్ప ఇరు జట్లు తొలి మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడిని పక్కన పెట్టడం కాస్త కష్టమే. కానీ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగల ఆటగాడు జట్టుకు అవసరం. అందుకే శ్రేయస్‌ను పక్కన పెట్టక తప్పడం లేదు. అతడి విషయంలో మేం స్పష్టంగా ఉన్నాం. ఆటగాళ్లంతా అందుబాటులో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ప్లేయర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తుది జట్టు కూర్పులో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జట్టు అవసరాలకు తగ్గట్లు రాణించే ఆటగాళ్ల విషయంలో మాకు స్పష్టత ఉంది. యువ ఆటగాళ్లు కూడా జట్టు విజయాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారనుకుంటున్నా.
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్