కోల్‌కతా, ఫిబ్రవరి 14: పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. బిధాన్నగర్, సిలిగురి, చందర్నగోర్, అసన్సోల్ నాలుగు కార్పోరేషన్లనూ ఆ పార్టీ కైవసం చేసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. టీఎంసీ బిధాన్నగర్లో 41 స్థానాలకు 39, చందర్నగోర్లో 32కి 31 వార్డులు గెలుచుకుంది. ఈ రెండు కార్పొరేషన్లలో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరువలేకపోయింది. లెఫ్ట్‌ఫ్రంట్ చేతిలో ఉన్న సిలిగురి మున్సిపాలిటీని చేజిక్కించుకున్న మమత పార్టీ.. 47 వార్డులకు గానూ 37లో విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ బీజేపీ 5 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక అసన్సోల్లో 106కి టీఎంసీ 91 గెలుచుకోగా, బీజేపీ ఏడు మాత్రమే దక్కించుకున్నది. మొత్తం మీద ఎన్నికలు టీఎంసీకి వార్ వన్‌సైడ్ కాగా, బీజేపీతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ఫ్రంట్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇది ప్రజా విజయమని మమత అన్నారు. అభివృద్ధిని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు.