Adilabad | మంచిర్యాల, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి పులుల రాకపోకలు పెరగగా, సమీప గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులు.. మనుషులపై దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నాయి. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, అది జరిగి 24 గంటలైనా గడవక ముందే శనివారం సిర్పూర్-టీ మండలం దుబ్బగూడలో రైతు సురేశ్‌పై పంజా విసిరి తీవ్రంగా గాయపరిచింది. ఇక గతంలో పులులపై విషప్రయోగం జరగగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటి భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
పులుల భద్రతపై అనుమానాలు
యేటా ఈ సీజన్లో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అవి రాకముందే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు.. దాడులు జరిగినప్పుడే స్పందించి ఆపై మిన్నకుండి పోతున్నారు. గతంలో జరిగిన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గతేడాది ఆసిఫాబా ద్ జిల్లాలో ఓ పెద్దపులి.. దాని పిల్లలు పాడిపశువులపై దాడులు చేశాయి. విసిగిపోయిన పలువురు రైతులు పులి చంపేసిన పశువుపై విషప్రయో గం చేశారు. ఆ మాంసాన్ని తిన్న పెద్దపులితో పాటు ఓ పిల్లపులి సైతం మృతిచెందింది. కాగజ్‌నగర్ డివిజన్ దరిగాంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం పాడిపశువులనే చంపేస్తున్నాయన్న కోపంతోనే పులులకు విషం పెట్టినట్లు నిందితులు చెప్పారు. ఇప్పుడు సైతం అదే తరహాలో ప్రతి రోజూ ఏదో ఒక చోట పెద్దపులుల దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపులుల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పులుల వివరాలపై గోప్యత ఏదీ..
సాధారణంగా అడవిలో పెద్దపులుల కదలికలుంటే ఆ వివరాలు బయటికి చెప్పకూడదు. వేటగాళ్లు పులులపై దాడి చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు వివరాలను గోప్యంగా ఉంచుతారు. చలికాలంలో తోడు కోసం బయటికి వచ్చే పెద్దపులులు జనవాసాల్లోకి వస్తుండడంతో వా టిపై ఫోకస్ పెరిగింది. ఎక్కడ పులి కనిపించినా నిమిషాల్లో సోషల్ మీడియాలో అది చక్కర్లు కొ డుతున్నది. అధికారులకు సమాచారం తెలిసేలో పే మీడియాలో పులి వార్తలు వస్తున్నాయి. పులి వివరాల్లో గోప్యత అన్నది ఎక్కడా కనిపించడం లేదు.
బీట్ ఆఫీసర్లు, వాచర్లు, కొందరు అటవీ శాఖ అధికారులు పులి కదలికలపై డైరెక్ట్‌గా ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో జనవాసాల్లోకి వచ్చే పులుల గురించి సమాచారం ఇవ్వడంలో అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారు. పు లులను ట్రాక్ చేయలేకపోతున్నారు. పులి తిరుగుతున్న సమీపంలోకి గ్రామాలు, గూడేలు, తం డాల్లో ముందస్తు సమాచారం ఇచ్చి జనాలు ఎ వ్వరూ బయటికి రాకుండా చూడాలి. కానీ అది సరిగా జరగడం లేదు. అందుకే పులుల దాడులంటూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు పులుల వివరాలపై గోప్యత పాటిస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
ఇబ్బంది లేదు : శాంతారాం, ఎఫ్డీపీటీ
సాధారణంగా చలికాలంలో పులులు అడవుల్లోకి వస్తాయి. వాటి భద్రతపై ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ప్రొటక్షన్ స్ట్రక్చర్ బాగుం ది. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పులుల కదలికలు కనిపెడుతున్నారు. సీసీ కెమెరాలు సైతం బిగించి ఉన్నాయి. వాచర్స్, యానిమల్ ట్రాకర్స్ నిత్యం తిరుగుతూనే ఉన్నారు. కొంత ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా బీట్ ఆఫీసర్ల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటితో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ప్రజలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు.
అటవీశాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు..
పులుల భద్రతపై అనుమానాలు తలెత్తడానికి ప్రధాన కారణం అటవీశాఖలో ఖాళీలు ఉండడమే. మరీ ముఖ్యంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఒక్క డీఆర్వో పోస్టులు తప్ప మిగిలిన పోస్టుల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. టైగర్ రిజర్వ్‌లో మంచిర్యాలలో తప్ప ఎక్కడా కూడా ఎఫ్‌డీవోలు పర్మినెంట్ వారు లేరు. చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉట్నూర్ ఎఫ్‌డీవో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. జన్నారంలో ఏడాదిన్నరగా, చెన్నూర్‌లో నాలుగు నెలలుగా, బెల్లంపల్లిలో రెండున్నరేళ్లుగా, ఆసిఫాబాద్‌లో రెండేళ్లగా, ఖానాపూర్‌లో యేడాదిగా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఉట్నూర్, కాగజ్‌నగర్ దాదాపు మూడేళ్లు ఖాళీగా ఉన్నాక అక్కడ ట్రైనీలకు పోస్టింగులు ఇవ్వనున్నారు. వచ్చే ఐఎఫ్ఎస్లు ట్రైనింగ్ పూర్తి చేసుకొని వెళ్లిపోతే అక్కడ మళ్లీ ఖాళీలు ఏర్పడనున్నాయి.
ఖానాపూర్‌కు ఆర్మూర్ ఎఫ్‌డీవో భవాని శంకర్, ఆసిఫాబాద్‌కు జిల్లా డీఎఫ్‌వో నీరజ్ కుమార్, బెల్లంపల్లి, జన్నారం ఇన్చార్జి ఎఫ్‌డీవోగా మంచిర్యాల డీఎఫ్‌వో శిశ్ ఆశిశ్‌సింగ్, చెన్నూర్‌కు మంచిర్యాల ఎఫ్‌డీవో సర్వేశ్వర్ ఇన్చార్జిగా ఉన్నారు. ఇక బీట్ ఆఫీసర్ల పోస్టులైతే దాదాపు 45 శాతం వరకు ఖాళీ ఉన్నాయి. ఈ మధ్యే పది, పదిహేను మందికి గ్రూప్-4 ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. వంద పోస్టులు ఉంటే.. ప్రస్తుతం 45 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక ఎఫ్ఆర్వో పోస్టులు సైతం ఖాళీలుగా ఉన్నాయి. కాగజ్‌నగర్ డివిజన్లో ఒకటి, ఆసిఫాబాద్ డివిజన్లో ఒకటి, మంచిర్యాలలో ఒకటి, జన్నారంలో రెండు, ఖానాపూర్‌లో ఒకటి చొప్పున ఎఫ్ఆర్వో పోస్టులు ఖాళీ ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.