పెనుబల్లి, జనవరి 30: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురం, చౌడవరం, మండాలపాడు, పాతకారాయిగూడెం గ్రామాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. రామచంద్రాపురం నుంచి నీలాద్రి గుడికి వెళ్లే ప్రాంతంలో పులి రోడ్డు దాటుతుండగా చూశామని గ్రామస్థులు చెప్పడంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. మండాలపాడు, లంకపల్లి రహదారి మధ్య నుంచి పాతకారాయిగూడెం వరి పొలాల మీదుగా పులి అటవీప్రాంతానికి వెళ్తున్నట్టు అటవీశాఖ అధికారులు అంచనాకొచ్చారు. సత్తుపల్లి రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎఫ్‌డీవో సతీశ్‌కుమార్ పులి పాదముద్రలను సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.