సంగారెడ్డి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపల, సమీపంలో ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ప్రభుత్వం ఔటర్ రింగ్‌రోడ్డు లోపల గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి, తదనంతరం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ముందస్తుగానే నిర్ణయం తీసుకుంది.
అందుకు అనుగుణంగానే మొదట పటాన్చెరు మండలంలోని పోచారం, ముత్తంగి, కర్థనూరు, పాటి, ఘనపూర్ గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఆ తర్వాత అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్, ఐలాపూర్తండా, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ, దాయర, సుల్తాన్పూర్ గ్రామాలను అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేసింది. తాజాగా ప్రభుత్వం తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలతో పాటు బొల్లారం మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. మూడు మున్సిపాలిటీలు మూడు జీహెచ్ఎంసీ డివిజన్లుగా మారనున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో ఇది వరకే పటాన్చెరు, భారతినగర్, రామచంద్రాపురం డివిజన్లు ఉన్నాయి. కొత్తగా తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
పెరుగనున్న పన్నుల భారం
తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ విలీనం చేయడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. జీహెచ్ఎంసీలో విలీనంతో మూడు మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. ప్రజలపై పన్నుల భారం మరింత పెరుగనున్నది. మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు ఉంటాయి. పాలకవర్గం ఎంపీ, ఎమ్మెల్యేల సహాయంతో నిధులు తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు ఉంటుంది. పట్టణంలోని వివిధ వార్డుల్లో రహదారులు, మురుగుకాల్వల నిర్మాణం తదితర అభివృద్ధి పనులపై మున్సిపల్ పాలకవర్గం తక్షణం నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించవచ్చు. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో అభివృద్ధి పనులు కుంటుపడనున్నాయి.
జీహెచ్ఎంసీ డివిజన్లలో ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు ఉండవు. అభివృద్ధి పనులు చేపట్టాలంటే కార్పొరేటర్, ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ పాలకవర్గం అనుమతి తప్పనిసరి అవుతుంది. మున్సిపాలిటీల్లో కమిషనర్ సహా ఇతర అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. జీహెచ్ఎంసీ అధికారులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరు. దీంతో పౌరసేవలు సులువుగా అందుబాటులోకి రావు. ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం పరిధిలోని ప్రజలు ఇకపై కొత్త ఇండ్ల్లు నిర్మించాలంటే జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందుకు అధిక సమయం పట్టడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి అనుమతుల రుసుం ఎక్కువగా ఉంటుంది. మున్సిపాలిటీలతో పోల్చితే జీహెచ్ఎంసీలో ఇంటిపన్నులు అధికంగా ఉంటాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడక తప్పదు.