హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. రాజస్థాన్ నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. శనివారం పలు జిల్లాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.