సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా పేదలకు చేయూతనిచ్చేలా సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఇందులో భాగస్వాములను చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఏనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథ శరణాలయంలో విద్యార్థులతో కలిసి సీఎం జన్మదిన వేడుకలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు బ్యాగులు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లోనూ పాల్గొన్నారు.
– మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 15
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలసి మూడ్రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో పెద్దఎత్తున్న పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథ శరణాలయంలో విద్యార్థులతో కలిసి సీఎం జన్మదిన వేడుకలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు బ్యాగు లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడ్రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నడుంబిగించి తెలంగాణ సాధించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అన్నారు.
దేశంలోనే అత్యధికంగా ప్రజాప్రతినిధులు ఉన్నా టీఆర్ఎస్ నాయకులందరూ ఈ మూడ్రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు, వస్త్రాలు, దుప్ప ట్లు, పేద విద్యార్థులకు, పేదలకు చేయూతనిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందరికీ అం దుతున్నాయన్నారు. ఇలాంటి నేత మన తెలంగాణ గడ్డమీద పుట్టడం గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బందికి దుప్పట్లు, సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ గణేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, వైస్ చైర్మన్ శామ్యూల్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు వనజ, పటేల్ ప్రవీణ్, నాయకులు శివరాజ్, వినోద్, అహ్మద్ పాల్గొన్నారు.
గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న అయ్యప్ప గుట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ సంత్ సేవాలాల్ అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. పాలమూరులోని అయ్యప్ప కొండపై మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంతో ధైర్యం, తెగువ ఉన్న గిరిజన జాతి గతంలో అడవికే పరిమితమైందని గుర్తు చేశారు. తండాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు గడిచినప్పటికీ వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతోపాటు గిరిజనులనే సర్పంచులుగా ఎదిగేలా చేసి వారికి రాజ్యాధికారం ఇచ్చామని పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా గిరిజన భవన్‌కు, సంత్ సేవాలాల్ ఆలయానికి వెయ్యి గజాల స్థలాన్ని ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆలయ నిర్మాణంలో రూ.15 లక్షలు గిరిజన సంఘం అందిస్తే తనవంతుగా రూ.15 లక్షలు ఇస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నాటికి ఆలయం పూర్తి చేసి జయంతి వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన భవన్‌తో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గిరిజన పాఠశాల, ఉద్యోగ భవన్, మొత్తం రూ.13 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, గిరిజన సంఘం నాయకులు చందర్ నాయక్, దేవుజా నాయక్, డీటీడీవో ఛత్రునాయక్, జెడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో పద్మశ్రీ, సోషల్ వెల్ఫేర్ డీడీ యాదయ్య, గిరిజన నాయకులు, అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.