మిర్యాలగూడ, జూన్ 16 : మిర్యాలగూడ పట్టణంలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు చోరికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సోమనర్సయ్య తెలిపారు. మంగళవారం టూ టౌన్ పోలీస్ట్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణ పోలీసులు హనుమాన్‌పేట ఫ్లై ఓవర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి డాక్యుమెంట్లు చూపించాలని అడగగా వారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు మద్యం సేవించడం, గుట్కా వినియోగించడం, పేకాట ఆడడం వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడి డబ్బులు సంపాదించాలన్న ఉద్ధేశ్యంతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను చోరి చేసినట్లు ఒప్పుకున్నారు.
నిందితులను నల్లగొండ పట్టణ అర్జాలబావికి చెందిన కొంగరి నవీన్‌కుమార్, పాలకీడు మండలం గుడుగుంట్లపాలెంకు చెందిన సోమిరెడ్డి సైదిరెడ్డి, దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన కె.సుమలతగా గుర్తించారు. పాత ద్విచక్ర వాహనాలను దొంగలించి దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న సుమలత పాత ఇనుప సామాను దుకాణంలో విక్రయించినట్లు తెలిపారు. ఆమె మోటార్ సైకిళ్లను రూ.2,500 నుండి రూ.3 వేలకు తక్కువ ధరకు కొనుగోలు చేసి విడి భాగాలుగా విభజించి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చోరీ వాహనాల స్పేర్ పార్ట్స్ విక్రయించగా వచ్చిన రూ.1.38 లక్షల నగదును సుమలత నుండి స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిందితుల నుండి రెండు మోటార్ సైకిళ్లు, రూ.1.38 లక్షల నగదును స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు. ముగ్గురు నిందితులను కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.