America | వాషింగ్టన్, అక్టోబర్ 28: అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం 50 రాష్ర్టాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ర్టాలు ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వాటినే ‘స్వింగ్ స్టేట్స్’ అంటారు. తటస్థ ఓటర్లతో అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పగలిగే ఈ ‘స్వింగ్ స్టేట్స్’ జాబితాలో అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. దీంతో ఈసారి స్వింగ్ స్టేట్స్ను గెలుచుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఈ 7 రాష్ర్టాల్లో ఆరింట పైచేయి సాధించి 306-232 ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోగా.. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి స్వింగ్ స్టేట్స్లో ట్రంప్, హారిస్ మధ్య పోరు హోరాహోరీగా సాగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి అమెరికాలో చాలా మంది ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపబోతున్నదీ ముందే చెప్పేస్తారు. తద్వారా రిపబ్లికన్లు, డెమోక్రాట్లుగా గుర్తింపు పొందుతారు. దీంతో ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో ముందే తెలిసిపోతుంది. కానీ, స్వింగ్ రాష్ర్టాల ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. గుడ్డిగా ఏ పార్టీకీ మద్దతివ్వరు. దీంతో ఈ స్వింగ్ రాష్ర్టాలే అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారి ఫలితాలను మార్చేస్తుంటాయి.
అరిజోనా
మెక్సికోతో సుదీర్ఘ సరిహద్దు ఉన్న ఈ రాష్ట్రం చాలా దశాబ్దాల నుంచి రిపబ్లికన్లకు కంచుకోటలా నిలుస్తున్నది. కానీ, ఈసారి అరిజోనాలో లాటిన్ ఓటర్లు పెరగడం, కాలిఫోర్నియా నుంచి చాలా మంది డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు వలస రావడంతో ప్రస్తుతం అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. అక్రమ వలసదారులతో తలెత్తుతున్న సమస్యలను అస్త్రంగా మలుచుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తుండగా.. వలసలను అరికడతామని కమలా హారిస్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అరిజోనాలో హారిస్ కంటే ట్రంప్ 2% ఆధిక్యతలో ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి.
జార్జియా
1992 నుంచి ఒక్కసారి కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని జార్జియా.. 2020లో స్వల్ప తేడాతో బైడెన్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఆయన 0.24% ఓట్ల తేడాతో గెలిచారు. ఈ రాష్ట్రంలో ఆఫ్రో-అమెరికన్ (నల్లజాతి) ఓటర్లు 33% మేరకు ఉండటం కమలా హారిస్‌కు కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్వల్ప మెజార్టీని తనవైపు తిప్పేలా చేయాలని ఎన్నికల అధికారులపై 2020లో ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు కేసు నమోదైంది. కానీ, ఆ కేసును 2024 ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వాయిదా వేయడం ట్రంప్‌కు ఊరట కలిగించింది.
మిషిగన్
అరబ్-అమెరికన్లు అధికంగా ఉండే ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు బలమైన కేంద్రంగా పేరు పొందింది. గత ఎన్నికల్లోనూ మిషిగన్ ఓటర్లు బైడెన్ వైపు మొగ్గు చూపినప్పటికీ ప్రస్తుతం ఆయనపై అసంతృప్తితో ఉన్నారు. గాజా-పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని వారు హర్షించడం లేదు. 2016 ఎన్నికల్లో మిషిగన్‌లో పైచేయి సాధించిన ట్రంప్.. ఈసారి కూడా ఆ రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
నెవాడా
దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రం 2004 నుంచి రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. కానీ, ఈసారి హిస్పానిక్ ఓటర్ల మద్దతుతో ఆ రికార్డును తిరగరాయగలమని రిపబ్లికన్లు గట్టిగా నమ్ముతున్నారు. కొవిడ్ సంక్షోభానంతరం అమెరికా అంతా కోలుకున్నప్పటికీ ఆతిథ్య రంగంపై ఆధారపడిన నెవాడా మాత్రం వెనుకబడింది. దేశంలో నిరుద్యోగ శాతం అధికంగా ఉన్న రాష్ర్టాల్లో నెవాడా అగ్రస్థానంలో నిలిచింది.
నార్త్ కరోలినా
2016, 2020 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ట్రంప్ వైపు మొగ్గు చూపిన ఏకైక రాష్ట్రం ఇదే. 1980 తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే డెమోక్రాట్లకు పట్టం కట్టిన ఈ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఆఫ్రో-అమెరికన్లు దాదాపు 22 శాతం మేరకు ఉన్నారు. వీరంతా ఈసారి కమలా హారిస్ వైపు మొగ్గుచూపుతారని డెమోక్రాట్లు గట్టిగా నమ్ముతున్నప్పటికీ ఇటీవల నార్త్ కరోలినాపై ‘హెలెన్’ తుపాను తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించింది. దీని ప్రభావం ఎలా ఉంటుందోనని డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు.
పెన్సిల్వేనియా
డెమోక్రాట్లకు కంచుకోటగా పరిగణించే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రిపబ్లికన్లు గట్టి పోటీ ఇస్తున్నారు. సమకాలీన ఎన్నికల్లో ఏడుసార్లు డెమోక్రాట్ల వైపు, ఐదుసార్లు రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపిన ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉన్నది. ఈ ఏడాది జూలైలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. వలసదారుల వల్ల కలుగుతున్న నష్టంపై ట్రంప్ మద్దతుదారులు తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. గ్రామీణ, పట్టణ శివార్లలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, హారిస్ వర్గం పట్టణ ప్రాంత ఓటర్లపై ఆశలు పెట్టుకున్నది. 100 బిలియన్ డాలర్లతో పరిశ్రమలను ప్రారంభిస్తామని హారిస్ హామీ ఇచ్చినప్పటికీ పెరిగిన ద్రవ్యోల్బణం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
విస్కాన్సిన్
1988 నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికే ఓటేసిన ఈ రాష్ట్రం.. 2016లో ట్రంప్‌కు, 2020లో స్వల్ప తేడాతో బైడెన్‌కు పట్టం కట్టింది. ఈసారి ట్రంప్, హారిస్ ఫలితాన్ని మూడో పార్టీ అభ్యర్థి ప్రభావితం చేయవచ్చని పరిశీలకులు చెప్తున్నారు. ఇటీవల ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ బరిలోకి దిగినప్పటికీ ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతుగా రేసు నుంచి వైదొలిగారు. గ్రీన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్ స్టెయిన్‌ను అనర్హుడిగా చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తుండగా.. విస్కాన్సిన్లో గెలుపు తమదేనని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు.