ఇల్లెందు, మార్చి 13: బయ్యారం ఇనుప ఖనిజం నాణ్యతకు తిరుగేలేదని తేలింది. ఇక్కడి ఖనిజం 60+ ఎఫ్ఈ నాణ్యత కలిగి ఉన్నదని దశాబ్దాల క్రితమే వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణ ఏర్పాటులో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(జీఎంవో) సైతం ఆదేశించింది. అనంతరం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) దీనిని తన పరిధిలోనికి తీసుకొన్న ది. మరోసారి సర్వే నిర్వహించిన సెయిల్.. బయ్యారంలో ఖనిజ సంపద పరిమాణం, నాణ్యతను పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చి నివేదికను కేంద్రానికి అందజేసింది. అయితే.. ‘బయ్యారం ఇనుప ఖనిజం నాణ్యమైనది కా దు.. తగినంత పరిమాణంలో లేదు.. ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి సరిపడా భూమి లేదు.. బయ్యారం స్టీల్‌ప్లాంట్ నిర్మాణం అసాధ్యం’ అంటూ కేంద్రం మోకాలడ్డుతున్నది. బయ్యారం ఖనిజం బ్రహ్మాండమని సర్వేలు తేలుస్తున్నా కేంద్రం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నది.
బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఆది నుంచి హంసపాదులా మారింది. మొట్టమొదట 1954 లో మైనింగ్ ప్రారంభమైంది. 1969లో కేంద్రం నిపుణుల కమిటీని బయ్యారానికి పంపించింది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి బయ్యారం అనువైన ప్రదేశమని, అన్ని సహజసిద్ధమైన వనరులు ఉన్నాయని నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రం లో స్టీల్‌ప్లాంట్ ప్రతిపాదనే లేదు. తొలిసారిగా బయ్యారంలో ప్లాంట్ నిర్మించాలనుకున్న కేంద్రానికి సీమాంధ్ర నేతలు అడ్డుతగిలారు. ప్లాంట్ నిర్మాణానికి నీటి, స్థల సమస్యలను ప్రధానంగా చూపించారు. ఆ తరువాత విశాఖలో స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం అంగీకరించింది.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేం ద్రం సర్వేలతో మమ అనిపించింది. 2008లో మైనింగ్ శాఖ సర్వే చేసింది. 2014లో జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైనింగ్ శాఖ బయ్యారం పరిసర ప్రాం తాల్లో మరోసారి సర్వే నిర్వహించాయి. ఇక్కడి ఖనిజ నాణ్యత, పరిమాణం, ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయి నివేదికలను కేంద్రానికి అందజేశాయి. బయ్యా రం రిజర్వ్‌ఫారెస్ట్‌లో ఉన్న ఇనుప ఖనిజం అత్యంత నా ణ్యత కలిగిందని పేర్కొన్నాయి. ఇక్కడి ఖనిజానికి 60 ప్లస్ ఎఫ్ఈ నాణ్యత ఉన్నదని సర్వేల్లో వెల్లడించాయి. ఇక ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమిలేదన్న వాదన తప్పని నిగ్గు తేల్చాయి. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రక్షణ స్టీల్స్‌కు బయ్యారాన్ని కేటాయించి ఫిబ్రవరి 2009లో ఒప్పందం కుదుర్చుకొన్నారని తెలిపాయి. అయినా ఏవో సాకులు చూపుతూ కేంద్రం ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశానికి నీళ్లు వదులుతున్నది.
బయ్యారంలో భారీగా ఇనుపరాయి ఖనిజం విస్తరించి ఉన్నదని అధికారులు స్పష్టంచేశారు. 19 మీటర్ల నుంచి 40 మీటర్ల లోతులో 21 మీటర్ల మందం పొర ఇనుప ఖనిజం బయ్యారం నుంచి గూడూరు వరకు విస్తరించి ఉన్నట్టు 2009లో సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు వెల్లడించారు. లోతుకు వెళ్లేకొద్దీ మరిన్ని పొరలు ఉంటాయని, ఇనుపరాయి నాణ్యత కూడా పెరుగుతుందని అంచనాకు వచ్చారు. బయ్యారం గుట్టకు సంబంధించి రిజర్వ్‌ఫారెస్టు మూడు కంపార్టుమెంట్లుగా నాడే విభజించారు. ఈ మూడు కంపార్టుమెంట్లలో లభించే ముడిఖనిజం 60 ప్లస్ ఎఫ్ఈ క్వాలిటీ ఉంటుందని వెల్లడించారు.