జగిత్యాల రూరల్, ఏప్రిల్ 7 : అప్పటిదాకా దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులతో గడిపిన మూడోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తోపారపు చంద్రశేఖర్-నవిత దంపతుల కుమారుడు నిశాంత్ (9) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
మంగళవారం గ్రామ శివారులోని శివాలయంలో అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో కలిసివెళ్లాడు. అప్పటిదాకా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన నిశాంత్ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జగిత్యాల దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.