ఒక సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తేనే అభిమానుల తాకిడి తట్టుకోలేం. ఇద్దరు సూపర్‌స్టార్స్ కలిసి చేస్తే ఇక థియేటర్ల దగ్గర జాతరే. ఆల్రెడీ దర్శకుడు నెల్సన్‌కుమార్ ముగ్గురు సూపర్స్టార్లతో ‘జైలర్’ సినిమా తీసి రికార్డుల్ని తిరగరాశారు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు చేస్తూ.. ఏకంగా నలుగురు సూపర్‌స్టార్స్‌తో ‘జైలర్ 2’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నది. విశేషమేంటంటే.. భారతీయ సూపర్స్టాైర్లెన రజనీకాంత్, షారుఖ్‌ఖాన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌లు ఈ షూట్లో పాల్గొంటున్నారట.
నలుగురు సూపర్స్టార్లు ఒకేసారి షూటింగ్లో పాల్గొనడం నిజంగా విశేషమే. ఇప్పటికే మోహన్‌లాల్‌పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం నలుగురు సూపర్స్టార్లపై ఓ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్‌ని నెల్సన్ షూట్ చేస్తున్నారట. ‘జైలర్ 2’ కోసం షారుఖ్‌ఖాన్ కేవలం అయిదు రోజులు మాత్రమే డేట్స్ కేటాయించారని, అందుకే ఆయన కాంబినేషన్ సీన్స్ అన్నింటినీ పూర్తి చేస్తున్నారని చిత్రబృందం తెలిపింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదల కానున్నది.