LIC IPO | అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవో త్వరలో స్టాక్ మార్కెట్లను తాకనున్నది. తమ ఐపీవోను అనుమతించాలని కోరుతూ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ముందు ఎల్ఐసీ డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. ఈ ఐపీవోలో పాలసీ దారులకు 10 శాతం వాటాలను రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. పాలసీదారులతోపాటు సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్‌పై వాటాలు కేటాయిస్తామన్నది. ఈ నేపథ్యంలో పలువురు పాలసీదారులు ఐపీవోలో ఎల్ఐసీ స్టాక్స్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన రూల్స్ పాలసీదారులకను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇంతకీ పాలసీ దారు రిజర్వేషన్ వాటా కింద ఎల్ఐసీ పాలసీదారులంతా ఐపీవోలో అప్లయ్ చేయడానికి అర్హులేనా.. అంటే కాదని నిబంధనలు చెబుతున్నాయి.
ఒకవేళ మీరు మీ భార్య లేదా.. భర్తతో కలిసి డీమ్యాట్ ఖాతా తెరిచి ఉంటారు. అఫ్కోర్స్.. మీకు వేర్వేరుగా ఉన్న బీమా పాలసీలకు మీ ఇద్దరి పాన్‌కార్డులు అనుసంధానించి ఉంటారు. కానీ జాయింట్ డీమ్యాట్ ఖాతా ద్వారా ఎల్ఐసీ ఐపీవోలో దరఖాస్తు చేయడం సాధ్యం కాదని నిబంధన. సెబీ ఐసీడీఆర్ నిబంధనల ప్రకారం డీమ్యాట్ ఖాతాద్వారా ఒకరి పేరు మీద జంట లబ్ధిదారులు (భార్యాభర్తలు) అప్లికేషన్ సమర్పించడం కుదరదు. కేవలం ఫస్ట్ లేదా ప్రైమరీ బెనిఫిషియరీ పేరు మీద మాత్రమే అప్లికేషన్ నింపి, సబ్మిట్ చేయాలి.
పాలసీదారు మరణించిన తర్వాత దానిపై వచ్చే యూన్యుటీస్, ఇతర బెనిఫిట్లు పొందే ఆ వ్యక్తి జీవిత భాగస్వామి కూడా ఐపీవోలో దాఖలు చేయడానికి అనర్హులు. ప్రతి పాలసీదారు కూడా తన పేరు మీదే డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి. అలా కాకుండా తన జీవిత భాగస్వామి పేరిట గానీ, కొడుకు, బంధువు పేరిట ఉన్న డీమ్యాట్ ఖాతా నుంచి ఐపీవోకు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
పాలసీ హోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ ద్వారా ఐపీవోలో దరఖాస్తు చేయడానికి ఎన్నారైలు అనర్హులు. ఐపీవో టైంలో భారత్‌లో నివసిస్తున్న వారే ఐపీవోకు దరఖాస్తు చేయడానికి అర్హులు. పాలసీదారు పేరిట నామినీ బిడ్ దాఖలు చేయడానికి అనర్హులు. గ్రూప్ బీమా పాలసీలు మినహా అన్ని పాలసీలు ఈ పథకం కింద ఐపీవోకు దరఖాస్తు చేయడానికి అర్హత కలిగి ఉంటాయి. అంతే కాదు పాలసీదారులు నాన్-ఇన్స్ట్యూషన్ బిడ్, ఆర్ఐబీ బిడ్ వేయొచ్చు.