హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ): యాసంగి పంటకోసం వరి విత్తనాలను విక్రయించరాదని ఏ విధమైన నిషేధాన్ని విధించలేదని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. భవిష్యత్‌లో కూడా వరిసాగుపై నిషేధం లేదా వరి విత్తనాల అమ్మకాలపై ఆంక్షలు విధించే ఆలోచన లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. వరిసాగుపై సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై దాఖలైన రిట్ పిటిషన్‌ను జస్టిస్ వినోద్‌కుమార్ బెంచ్ మంగళవారం విచారించింది.
వరి విత్తనాలు అమ్మరాదని సిద్దిపేట కలెక్టర్ ప్రకటించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నిషేధిత జాబితాలో లేనప్పుడు కలెక్టర్ అలా మాట్లాడటం సరికాదని ధర్మాసనం పేర్కొన్నది. ఏజీ కల్పించుకొని అలాంటి చర్యలేమీ చేపట్టడంలేదని వివరించారు. కలెక్టర్‌కు తన వాదనను చెప్పుకొనే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో వరివిత్తనాల అమ్మకాలు, కొనుగోలుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కలెక్టర్‌ను ఆదేశిస్తూ, కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయో? లేదో? పరిశీలించేందుకు వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.