కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 18 : పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకుందామని.. ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు… అయితే ఆ యువకుడు వివాహాన్ని వాయిదా వేస్తుండటంతో మనస్తాపం చెందిన యువతి తనువు చాలించింది. కేపీహెచ్‌బీ కాలనీ సీఐ కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్ (32), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండ పవిత్ర (30) ఖమ్మంలో బీ ఫార్మసీ చదువుతున్నప్పుడు స్నేహితులుగా మారారు. మళ్లీ ఫేస్‌బుక్‌తో తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెండ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
అయితే అబ్బాయి తల్లిదండ్రులు అడ్డుచెబుతూ.. కొన్నాళ్ల కిందట వేరే అమ్మాయితో గౌతమ్‌కు పెండ్లి చేసేందుకు నిశ్చయించగా, విషయం తెలిసిన పవిత్ర అడ్డుకుంది. తర్వాత గౌతమ్, పవిత్రలు కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో నివాసముంటున్నారు. పెండ్లి విషయాన్ని గౌతమ్ దాటేస్తుండటంతో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపంతో పవిత్ర ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి నారాయణ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గౌతమ్ మోసం చేశాడని అతడి తల్లిదండ్రులు చక్రధర్ రెడ్డి, దుర్గారాణిలు తన కూతురును వేధించారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.