దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోనూ త్వరలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. అయితే కొన్ని రాష్ర్టాల్లో సవరణ ప్రక్రియ పక్షపాతంగా జరిగిందని, ఓటరు జాబితా నుంచి అర్హుల పేర్లు గల్లంతయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజకీయ కారణాలతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వాడుకుంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి. బిహార్, బెంగాల్‌ల్లో జరిగిన ప్రక్రియలో లక్షలాది ఓటర్ల పేర్లు జాబితా నుంచి మాయం కావడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఓటరు జాబితా సవరణకు త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నది. అసలు సవరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరి పాత్ర ఏమిటి? వివరంగా చూద్దాం. ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో సవరణ కోసం చేపట్టిన కార్యక్రమం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్.ఐ.ఆర్). ప్రజాస్వామ్య బలోపేతమే లక్ష్యమంటూ 2025లో ఈసీ ఈ కార్యక్రమం చేపట్టింది. రెండు దశల్లో 13 రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తి చేసింది.
భారత పౌరుడై ఉండి, 18 ఏండ్లు నిండిన వాళ్లు అర్హులు. చట్టం ప్రకారం ఓటరు జాబితా సవరణ ఎప్పటికప్పుడు చేపడుతూ ఉండాలి. ప్రతీ ఎన్నికల ముం దు, లేదా అవసరాన్ని బట్టి సవరణ చేపట్టాలి. ఓట రు జాబితాను సవరించాలని రాజకీయ పార్టీలు పలు సందర్భాల్లో కోరుతూ వస్తున్నాయి. 1951 నుంచి 2004 వరకు ఓటరు జాబితా సవరణను 21 సార్లు చేపట్టారు. 2002-04 మధ్య చివరిసారిగా జాబితా సవరణ చేశారు. చాలామంది పలు సందర్భాల్లో వలసలు వెళ్లడం, కొందరు ఓటర్లు ఒక్క చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉన్నప్పుడు తొలగింపు అవసరం. మరణించిన వ్యక్తుల పేర్లను జాబితా నుంచి తొలగించాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా జాబితా సవరణ చేయాలి. భారత పౌరులు కాని వారి పేర్లు జాబితాలో నమోదైతే వాటిని తొలగించాలి.
ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉంటారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో) ఉంటారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) ఉంటారు. ఈఆర్వో అంటే సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) స్థాయి అధికారి. చట్టం ప్రకారం ఈఆర్వో ఆధ్వర్యంలోనే ఎన్నికల జాబితా ముసాయిదా రూపొందిస్తారు. ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది జాబితా సిద్ధం చేసి, విడుదల చేస్తారు. ప్రతీ మండలానికి ఒక అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్వో) ఉంటారు. ఈఆర్వో రూపొందించిన జాబితాలో అభ్యంతరాలు ఉంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ముందు మొదటి విజ్ఞాపన చేసుకోవచ్చు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రెండో అప్పీల్ చేసుకోవచ్చు.
ఈఆర్వో, ఏఈఆర్వో ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఓటరు జాబితాలో పేర్కొన్న వివరాలతో ఎన్యూమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్)ను రూపొందిస్తారు. వీటిని బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతీ ఓటర్‌కు పంపిణీ చేస్తారు. అలాగే ఆ పేరు 2002-04లో ఓటరు జాబితా సవరణలో ఉందో లేదో పోల్చి చూస్తారు. బీఎల్వోలకు ఆల్ ఇండియా డాటా బేస్‌లో వివరాలను చూసే వెసులుబాటు కూడా ఉంటుంది. బీఎల్వోలు కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తులు తీసుకొంటారు. ఎన్యూమరేషన్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయడానికి సహకరిస్తారు. అనంతరం ఆ ఫామ్స్‌ను ఈఆర్వో/ఏఈఆర్వోకు సమర్పిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు బీఎల్వోలు ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి కనీసం మూడు సార్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సొంత గ్రామాల్లో అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో కూడా ఈఎఫ్‌లు సమర్పించవచ్చు. మరణించిన వారి పేర్లను, వలస వెళ్లిన వారి పేర్లను, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదై ఉన్న వారిని ఓటరు జాబితా నుంచి తొలగించే బాధ్యత కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లదే.
ఎవరెవరు ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పిస్తారో వారి వివరాలతో ఈఆర్వో, ఏఈఆర్వోలు ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. గతంలో జరిగిన ఓటర్ల జాబితా సవరణలోని వివరాలతో సరిపోని వారికి ఈఆర్వో, ఏఈఆర్వోలు నోటీసులు ఇస్తారు. వారి అభిప్రాయాలు, వాదనలు విని, అలాంటి వారి పేర్లను తుది జాబితాలో నమోదు చేయాలో, తొలగించాలో ఈఆర్వో, ఏఈఆర్వో నిర్ణయిస్తారు. అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హులైన వారి పేర్లు జాబితాలో లేకుండా చూడటం వీరి బాధ్యత. ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ)కు విజ్ఞాపన పెట్టుకోవాలి, అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సెకండ్ అప్పీలేట్ అథారిటీ)కి ఫిర్యాదు చేసుకోవాలి. ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించి బీఎల్వోలు, ఈఆర్వోలు, డీఈవోలకు ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వాలి.
రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి, ఎస్ఐఆర్ గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి. రాజకీయ పార్టీలు నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ)లకు కూడా శిక్షణ ఇవ్వాలి. బీఎల్ఏలు కూడా ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ సేకరించి బూత్ లెవల్ ఆఫీసర్స్‌కు సమర్పించే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రాబల్యంతోనో, ఇతర కారణాలతోనో ఓటర్లు ఎవరైనా జాబితా నుంచి తొలగింపునకు గురయ్యే ప్రమాదం ఉండొచ్చు. ఇలాంటి సమయంలో పార్టీలు తమ ఏజెంట్స్ ద్వారా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఓటరు జాబితా రూపొందించే ప్రక్రియలో కీలకమైన దశ… జాబితాను ముద్రించడం, పంపిణీ చేయడం, ఎన్యూమరేషన్ ఫామ్స్‌లోని వివరాలతో పోల్చి చూడటం. ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో 1200లకు మించి ఓటర్లు లేకుండా జాబితాలు రూపొందించడం. ఆ జాబితాను సీఈవో వెబ్సైట్లో/సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో పెట్టాలి.
ఓటరు జాబితాలో క్రితం ఎస్ఐఆర్తో మ్యాచ్ కాని వ్యక్తులు, అర్హతలకు సంబంధించిన పత్రాలు సమర్పించిన వారు, తనిఖీ సమయంలో సరైన పత్రాలు చూపించని వారు, క్రితం ఎస్ఐఆర్కు సంబంధించిన వివరాలు సమర్పించని వారికి ఎన్నికల అధికారులు నోటీసులు ఇస్తారు. అదే విధంగా ఓటర్లు, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా విజ్ఞాపనలు, అభ్యంతరాలను ఈఆర్వో, ఏఈఆర్వోలకు సమర్పించవచ్చు.
ఓటర్లకు సహాయార్థం ఎన్నికల అధికారులు వాలంటీర్లను నియమించాలి. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు, దివ్యాంగులు, పేదలకు వాలంటీర్లు సహకారం అందించాలి. ఈసీ జాబితా రూపొందించేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ పోలింగ్ స్టేషన్లో 1,200కు మించి ఓటర్లు ఉండకూడదు. కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి చర్చించాలి. ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకే వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎస్ఐఆర్లో భాగంగా చేపట్టే చర్యలు అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది.
– ఇనుగుర్తి సత్యనారాయణ 97046 17343