హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన మూడురోజుల సమ్మె శనివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి విధులకు హాజరుకావాలని నిర్ణయించారు. వేలం నుంచి సింగరేణి బ్లాకులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. శనివారం కూడా రీజినల్ లేబ ర్ ఆఫీసర్ సమక్షంలో ఇరుపక్షాలు భేటీ అయ్యాయి. బొగ్గు బ్లాకుల వేలం కేంద్ర సర్కారు విధాన నిర్ణయమని, సమస్య అక్కడే పరిష్కారం అవుతుందని యాజమాన్యం స్పష్టంచేసింది. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని, ఇతర ప్రముఖులను కలుస్తామని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. కార్మికుల ఇతర డిమాండ్లపై జనవరి 20న మరోసారి భేటీ కావాలని యాజమాన్యం, యూనియన్ నేతలకు రీజినల్ లేబర్ కమిషనర్ సూచించారు.
మూడోరోజూ రూ.60 కోట్ల నష్టం
సమ్మెలో మూడోరోజైన శనివారం అన్ని ఏరియాల్లో సమ్మె విజయవంతమైంది. సింగరేణి వ్యాప్తంగా మొద టి షిప్టులో మొత్తం 27,559 మందికి 22,986 మంది, రెండో షిప్టులో 6,885 మందికి 5,458 మంది సమ్మెలో పాల్గొన్నారు. అన్ని ఏరియాల నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా సమ్మె కారణంగా శనివారం కేవలం 30 వేల టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేసినట్టు అధికారు లు తెలిపారు. సమ్మె కారణంగా మూడోరోజు సంస్థకు రూ.60 కోట్లు నష్టం వాటిల్లింది. కార్మికులు కూడా వేతనాల రూపంలో రూ.15 కోట్లు నష్టపోయారు. సమ్మెలో టీబీజీకేఎస్తోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘా ల నాయకులు పాల్గొన్నారు. నాలుగు బొగ్గుబ్లాకుల వే లాన్ని రద్దు చేసేదాకా పోరాటం చేస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పేర్కొన్నారు. సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.