బీర్కూర్: సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంత నాయకులమంతా సవతి తల్లి పిల్లల మాదిరిగానే ఉండేవాళ్లమని, తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండేది కాదని రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి రైతు పక్షపాతిగా నిలిచారని అన్నారు. దీనికి గాను ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ. 1960, బీ గ్రేడుకు రూ.1940 ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
రైతులు తక్కువ ధరలకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. వారంరోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు పడినప్పటికీ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఆసరా ఫించన్లు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రెండు పడక గదుల నిర్మాణాలను ఆపలేదన్నారు. దీనికంతటికీ సీఎం సమర్ధవంతమైన పరిపాలనే నిదర్శనమని ఆయన చెప్పారు. రైతులు కచ్ఛితంగా ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు.
శనగ, వేరు శనగ, ప్రొద్దు తిరుగుడు పువ్వు, సోయాబీన్ తదితర పంటలతో పాటు ఆయిల్ పామ్ పంటను వేసుకోవాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారన్నారని స్పీకర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, వ్యాయామశాల అధ్యక్షుడు గురువినయ్ కుమార్, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, మండల నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎజాజ్, అలీమొద్దీన్ బాబా, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.