సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: నిజాం పాలనలో దొరల దురాగతాలతో విసిగిపోయిన ప్రజల తరఫున పోరాడి, రైతాంగ సాయుధ తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం సంగారెడ్డిలో ఆవిష్కరించనున్నారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవిష్కరించనున్నారు. మామిడిపల్లిలో ప్రభుత్వం కేటాయించిన 1.23 ఎకరాల భూమిలో కురుమ సంఘం భవనం, విద్యార్థుల కోసం నిర్మించే హాస్టల్ భవనానికి మంత్రి భూమి పూజ చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కురుమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పెద్ద ఎత్తున తరలిరావాలి: సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్ కురుమ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించనున్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్ కురుమ తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఇప్పటికే ఆయా మండలాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి. విగ్రహావిష్కరణ ప్రత్యేకతను వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం కురుమ భవనం కోసం ప్రభుత్వం కేటాయించిన ఎకరా 23 గుంటల భూమిలో భవనంతో పాటు విద్యార్థుల కోసం నిర్మించే హాస్టల్ భవనానికి భూమి పూజ చేయనున్నారన్నారు. స్థానిక గణేశ్‌గడ్డ నుంచి సంగారెడ్డి వరకు బైక్ ర్యాలీ ఉంటుందని, అనంతరం ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం పీఎస్ఆర్ గార్డెన్స్‌లో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు దాదాపు 10 వేల మంది కురుమలు హాజరు కానున్నట్టు తెలిపారు.