తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి17 : రాష్ట్ర ఏర్పాటు కోసమే జన్మించిన నేత సీఎం కేసీఆర్ అని, ఆయనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కరువుతో అల్లాడుతున్న రాష్ర్టాన్ని పచ్చదనంతో నింపిన ఘనత ఆయనదని కొనియాడారు.
సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మానసిక వికలాంగుల పాఠశాలలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి కేకు కట్ చేసి, విద్యార్థులకు పండ్లు అందజేశారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత చరిత్ర ఎంతో గొప్పదని, కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే రాజకీయ పార్టీ టీఆర్ఎస్ను స్థాపించిన గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఉద్యమ సమయంలో వ్యతిరేక శక్తులు తెలంగాణ రాదన్నా, ఆత్మవిశ్వాసంతో మేధావి వర్గాన్ని ఏకం చేసి నడిపంచారని గుర్తు చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్3 ద్వారా ఉన్న వెసులుబాటు ద్వారా రాష్ట సిద్ధి కోసం కొట్లాడి.. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి రాష్ర్టాన్ని సాధించకునేలా చేశామన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో ప్రధానమైన కరెంటు సమస్యను పరిష్కరించి, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు కరెంటు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
కరువుతో అల్లాడుతున్న రాష్ర్టానికి గోదావరి, కృష్ణ జలాలతో కోటి ఎకరాలకు నీళ్లు అందించి, దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తయారు చేశామన్నారు.