కోటపల్లి, అక్టోబర్ 5 : అస్నాద్, పారుపల్లి ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అస్నాద్, పారుపల్లి మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సువిశాలమైన కోటపల్లి మండలాన్ని రెండు మండలాలుగా చేయాలని ప్రాణహిత, గోదావరి నది పరివాహక గ్రామాల ప్రజల కల. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో అది సాకారం కాలేదు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పారుపల్లి మండల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. కోటపల్లి మండలం అత్యధిక విస్తీర్ణం కలిగి ఉండడంతో.. దాన్ని రెండు మండలాలుగా విభజించాలని నిర్ణయించారు.
పారుపల్లి మండల ఏర్పాటు ఆవశ్యకతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 1న మందమర్రిలో జరిగిన బహిరంగ సభలోనూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు పారుపల్లి, అస్నాద్ మండలాల ఏర్పాటు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. ఇందుకు వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ అదే వేగంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు పారుపల్లి, అస్నాద్ మండలాలు ఏర్పాటు చేసేలా నోటిఫికేషన్ జారీ చేయించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. పారుపల్లి మండల పరిధిలోకి పారుపల్లి, పుల్లగామ, సిర్సా, ఎదుల్లబంధం, లింగన్నపేట, ఆలుగామ, రొయ్యలపల్లి, ఎర్రాయిపేట, బోరంపల్లి, కావరకొత్తపల్లి, అన్నారం, అర్జునగుట్ట, రాజారం, రాంపూర్, కొల్లూరు, రావులపల్లి, దేవులవాడ, రాపనపల్లి, పిన్నారం, వెలమపల్లి, లక్ష్మీపూర్, బబ్బెరచెలుక గ్రామాలు రానున్నాయి. ఇక చెన్నూర్ మండలంలోని అస్నాద్‌ను మండలంగా ఏర్పాటు చేయగా, దీని పరిధిలోకి అస్నాద్, గంగారం, కొమ్మర, పొక్కూరు, పొన్నారం, సోమనపల్లి, నాగాపూర్, బీరవెల్లి, సుందరశాల, నర్సక్కపేట, దుగినెపల్లి గ్రామాలు వస్తున్నాయి.
పారుపల్లి అభివృద్ధికి అవకాశం
నూతన మండలంగా ఏర్పాటు కానున్న పారుపల్లి అభివృద్ధిలో దూసుకుపోనున్నది. పారుపల్లికి ఆధ్మాత్మిక క్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పారుపల్లి సమీపంలో పంచక్రోశ ఉత్తరవాహిణి ప్రవహిస్తుండడం, భైరవ కోనపై స్వయంభువుగా వెలిచిన భైరవుడు, భీమునిపాదం, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయాలతో పాటు పాండవులు సంచరించిన ఆనవాళ్లు ఉండడంతో మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. నూతన మండలం పరిధిలోకి వచ్చే గ్రామాల గుండా జాతీయ రహదారి 63 వెళ్తుండడం, ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తుండడం, ప్రాణహిత నదిపై బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు ఉండడం పారుపల్లి అభివృద్ధికి కలిసివచ్చే అవకాశం ఉంది. అలాగే అస్నాద్ కూడా మండల కేంద్రం అవుతుండడంతో ప్రగతిబాట పట్టనున్నది.
తగ్గనున్న దూరభారం..
పారుపల్లి మండలం ఏర్పాటు కానుండగా, తూర్పు ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలకు దూరభారం తగ్గనున్నది. గతంలో మండలంలో 21 గ్రామ పంచాయతీలుండగా, కొత్తగా మరో 10 పంచాయతీలు ఏర్పడడంతో ఆ సంఖ్య 31కి చేరుకుంది. ఇందులోని 16 గ్రామపంచాయతీలు తూర్పు ప్రాంతంలో ఉండ గా, కోటపల్లి మండలకేంద్రానికి సుమారుగా 20నుంచి 30కిలోమీటర్ల దూ రంలో ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు కోటపల్లి మండలకేంద్రానికి దూరంగా ఉండగా, పారుపల్లి మండలంగా ఏర్పడితే దూరభారం తగ్గనున్నది.
పారుపల్లి మండల ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే పారుపల్లితో పాటు రాంపూర్, సిర్సా, ఎదుల్లబంధం, ఆలుగామ, రాజారం, కొల్లూరు గ్రామాల ప్రజలు సంబురాలు చేసుకున్నారు. సిర్సాలో సర్పంచ్ పున్నంచంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పారుపల్లిని మండలంగా ఏర్పాటు చేయడంపై వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు విద్యాసాగర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హర్షం ప్రకటించారు.
ఇకపై ఎలాంటి బాధలుండవు
చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు పారుపల్లి, అస్నాద్ మండలాల ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు ఈ రెండు గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేస్తే ప్రజలకు పాలన మరింత చేరువవుతుంది. కోటపల్లి మండలంలోని పారుపల్లి పరిధిలోకి వచ్చే గ్రామాలు, చెన్నూర్ మండలంలోని అస్నాద్ పరిధిలోకి వచ్చే గ్రామాలు మండలకేంద్రాలకు దూరంగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇకపై ఎలాంటి బాధలు ఉండవు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ప్రత్యేక చొరవ వల్లే రెవెన్యూ డివిజన్, నూతన మండలాల ఏర్పాటు జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్
మా తమ్ముడు బాల్క సుమన్ చెన్నూర్ నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్లతో పోటీగా అభివృద్ధి చేస్తున్నాడు. చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు పారుపల్లి, ఆస్నాద్ మండలాలు కావాలని అడిగిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్‌తో పాటు కొత్త మండలాలు చేసుకుందాం. ఎమ్మెల్యేగా ఉండి గిన్ని పనులు చేసిండు. దబ్బన రేపు కేసీఆర్ ఆశీర్వదించి తమ్ముడికి ప్రమోహన్ ఇస్తే చెన్నూర్ ఇంకెట్ల అవుతుందో మీరే అర్థం చేసుకోవాలి.
– ఈ నెల 1న మందమర్రి సభలో మంత్రి కేటీఆర్
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇచ్చిన మాట ప్రకారం చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు పారుపల్లి, అస్నాద్లను మండలాలుగా ఏర్పాటు చేయించారు. ఇది మాకు గొప్ప విజయం. విప్ ప్రత్యేక కృషి వల్ల పాలన చేరువ అవుతుంది. మా కల సాకారం చేసిన విప్ సుమన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– వాల శ్రీనివాస్ రావు, వైస్ ఎంపీపీ, కోటపల్లి
మా కష్టాలు తీరినట్లే..
పారుపల్లి మండల ఏర్పాటుతో ఇగ మా కాష్టాలు తీరినట్లే. కోటపల్లి మండల కేంద్రం మా గోదావరి, ప్రాణహిత గ్రామాలకు దూరంగా ఉంటుంది. మండల కేంద్రానికి వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీంతో మేమంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చాం. విప్ బాల్క సుమన్ అన్న మా తిప్పలను చూసి పారుపల్లిని మండలంగా ఏర్పాటు చేయించిండు. ఇందుకు మేమంతా రుణపడి ఉంటం. పారుపల్లి.. మా గ్రామాలకు అతి దగ్గరగా ఉంటుంది. దీంతో ప్రభుత్వ పాలన మాకు చేరువ కానుంది.
– దుర్గం ప్రదీప్, బోరంపల్లి
మా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం పారుపల్లిని మండలంగా ఏర్పాటు చేయించారు. ప్రాణహిత, గోదావరి పరీవాహక గ్రామాల కేంద్రంగా ఉన్న పారుపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నం. ఎంతో మంది నాయకులను కలిసినం. ఎవ్వరూ కూడా మా బాధను పట్టించుకోలే. ఇప్పుడు విప్ బాల్క సుమన్ అన్న మా కల నెరవేర్చిండు. పారుపల్లి మండలంతో పాటు చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విప్ బాల్క సుమన్‌కు ధన్యవాదాలు.
– పబ్బ అనిల్‌గౌడ్, పారుపల్లి
ప్రజల కోరిక నెరవేరింది
విప్ బాల్క సుమన్ పారుపల్లిని మండలంగా ఏర్పాటు చేయించి ప్రాణహిత, గోదావరి పరివాహక గ్రామాల ప్రజల గోస తీర్చిండు. ఆలుగామ నుంచి కోటపల్లి మండలకేంద్రానికి రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం. ఇగ ఇప్పుడు మా ఇబ్బందులు పోయినట్లే. మేమంతా సీఎం కేఆర్, మంత్రి కేటీఆర్, విప్ సుమన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.- కుమ్మరి సంతోష్,
ఆలుగామ, సర్పంచ్