హైదరాబాద్ : రాష్ట్రంలో భూములు అమ్మి ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన అవసరం లేదని, చేతగాక పోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ( MLC Dasoju Sravan) డిమాండ్ చేశారు. రేవంత్ స్థానంలో ఎవరు సీఎంగా ఉన్నా రాష్ట్రాన్ని బాగానే పాలిస్తారని,యూనివర్సిటీ భూములు ( University Lands ) అమ్మే వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా అవసరం లేదని పేర్కొన్నారు.
గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తారని ఆరోపించారు. విద్యా శాఖ మంత్రిగా ఉండి యూనివర్సిటీల భూములు అమ్ముకోవాలనే వైఖరి దుర్మార్గమని, వేల ఎకరాలు హస్తగతం చేసుకునే పనిలో పడి దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు.
ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాల భూములను దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఐఎస్బీ భూములకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలిసిందని పేర్కొన్నారు.విశ్వవిద్యాలయ భూముల స్వాధీనం విషయంలో కేబినెట్లో చర్చించారా? అంటూ ప్రశ్నించారు. ముస్లింల గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉర్దూ విశ్వవిద్యాలయ భూముల విషయంలో ఏం సమాధానం చెబుతుంది? అని నిలదీశారు.
ఉర్దూతో, ఉర్దూ అభ్యసించే విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోంది , ముస్లిం సమాజం మొత్తం తిరగబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కంచె గచ్చి బౌలి భూముల విషయంలో విద్యార్థులకు బీఆర్ ఎస్ అండగా ఉన్నట్టే ఉర్దూ యూనివర్సిటీ భూముల రక్షణ విషయం లో అండగా ఉంటుందని దాసోజ్ స్పష్టం చేశారు. ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కి వెయ్యి కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.