Lashkar-e-Taiba | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. పహల్గాం ఉగ్రదాడి వెనుకాల లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు భారత సైన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ప్రధాన స్థావరమైన ముర్కిదేను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అర్ధరాత్రి 1.44 గంటలకు ముర్కిదేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరంపై మిస్సైళ్లతో భారత్ మెరుపుదాడి చేసింది.
పాకిస్తాన్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎకరాల్లో లష్కరే తోయిబా తన ఉగ్రస్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జమ్మత్ ఉద్ దఆవా కూడా ఇక్కడ్నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయీద్ పహల్గాం ఉగ్రదాడి వెనుకాల ఉన్నట్లు భారత్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా ఉగ్రస్థావరాన్ని టార్గెట్ చేసి నేలమట్టం చేసింది.
బవహల్పూర్లోని ఉస్మాన్ ఓ అలి క్యాంప్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించింది. వాస్తవానికి దీన్ని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది. కానీ నాడు చివర్లో వదిలేసింది. ఈ సారి మాత్రం దాన్ని నేలమట్టం చేసింది. ముర్కిదే, బవహల్పూర్లోని క్యాంపుల్లో 25 నుంచి 30 మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది.