న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,190 పాయింట్లు పతనమై నాలుగు నెలల కనిష్ఠస్థాయి 55,822 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత ఈ స్థాయికి సెన్సెక్స్ తగ్గడం ఇదే ప్రథమం. ఎన్ఎస్ఈ నిఫ్టీ 371 పాయింట్లు పడిపోవడంతో 16,614 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,700 పాయింట్ల వరకూ పతనమై 55,132 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన తర్వాత ముగింపులో కొంతవరకూ కోలుకున్నప్పటికీ, భారీ నష్టాన్నే నమోదుచేసింది. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా టాటా స్టీల్ 5.2 శాతం పడిపోయింది. రంగాలవారీగా.. బీఎస్ఈ రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ బ్యాంకెక్స్, ఎనర్జీ ఇండెక్స్‌లు 4.74 శాతం తగ్గాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3.42 శాతం నష్టపోయాయి.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కారణం..
కొద్దిరోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లో అదేపనిగా విక్రయాలు జరుపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వారి అమ్మకాల్ని మరింత వేగవంతం చేసారని ట్రేడర్లు చెపుతున్నారు. శుక్రవారం రూ. 2,100 కోట్ల వరకూ విక్రయించగా, సోమవారం రూ.3,500 కోట్లు విక్రయించినట్లు ఎక్సేంజీల డేటా వెల్లడిస్తున్నది. వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున పలు కేంద్ర బ్యాంక్‌లు కఠిన ద్రవ్య విధానానికి శ్రీకారం చుట్టడం ఈ అమ్మకాలకు కారణమని వారు వివరించారు. అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కూడా మార్కెట్ పతనానికి మరో కారణమని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ చెప్పారు. దేశీయంగా పరిస్థితి అదుపులోనే ఉన్నా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగలిగితే దేశీయంగా కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయన్నారు.
రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి
వరుసగా శుక్ర, సోమవారాల్లో జరిగిన మార్కెట్ క్రాష్‌తో ఇన్వెస్టర్లు రూ.11.45 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ప్రత్యేకించి సోమవారం ఇన్వెస్టర్ల సంపదకు రూ.6,79 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,52,57,581 కోట్లకు తగ్గింది.