మేడ్చల్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : విజిలెన్స్ అధికారుల తనిఖీలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం పట్టివేత అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట్ జిల్లా గజ్వేల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన రెండు లారీలలో 590 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలో దిగారు. జిల్లాలోని కాప్రా, రామంతాపూర్ గోదాంలలో ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. రేషన్ డీలర్లకు తరలించే బియ్యం సరఫరా రికార్డులలో తప్పుడు నమోదులు ఉన్నట్లు వెల్లడైంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఫౌరసరఫరాల శాఖ.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయగా ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. అయితే ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా వారు సమాధానాన్ని దాటవేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన విషయాన్ని దాపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు మాత్రం ధృవీకరించారు.
ఇటీవల రెండు లారీలలో 590 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 618 రేషన్ దుకాణాలకు 3 నెలల సన్న బియ్యం 34,535 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని గుర్తించిన అధికారులు రేషన్ దుకాణాలకు పంపిణీ చేశారు. కాగా ఇప్పటికే 5,37,805 ఆహార భద్రత కార్డుదారులకు వంద శాతం బియ్యం పంపిణీ చేసామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మరి పట్టుబడిన 590 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఎలా మిగిలాయన్నాది ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లాలోని కాప్రా, రామంతపూర్ గోదాంలకు సరఫరా చేయాల్సిన దానికంటే అధికంగా చేయాలి లేదంటే ఇక్కడి గోదాంల నుంచి తక్కువగానైనా రేషన్ బియ్యాన్ని డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటే తప్ప ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం నిల్వఉండే అవకాశం లేదని విజిలెన్స్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై విజిలెన్స్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినవి, ఎక్కడికి తరలిస్తున్నారు, సహకరించిన ఉద్యోగులు ఎవరు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తికానున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు సమాచారం.