ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల పోలీస్ అధికారులతో జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ‘పాలన’ అనే పదానికే అర్థం మార్చే స్థాయిలో ఉన్నాయి. ట్రాఫిక్ చలాన్ల కోసం ఆటో డిటెక్టింగ్ సిస్టమ్, వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే వాహనదారుడి బ్యాంకు ఖాతాను ప్రభుత్వానికి లింక్ చేసి, చలాన్ పడగానే నేరుగా డబ్బులు డెబిట్ చేస్తామని చెప్పడం సంస్కరణ కాదు, ఇది ప్రజల ఆర్థిక స్వేచ్ఛపై ప్రభుత్వ దాడి.
ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ చలాన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా నడుస్తున్నది. తప్పు ఎవరిది అన్నది నిర్ధారించకుండా, అప్పీల్ చేసే అవకాశం ఇవ్వకుండా, ఫొటోలు, చలాన్ల పేరిట ప్రజలను వేధిస్తున్న వాస్తవాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో విచారణ లేదు.. న్యాయం లేదు.. నేరుగా ఖాతా ఖాళీ అన్న విధానాన్ని ప్రకటించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్టే. ఇది ట్రాఫిక్ నియంత్రణ విధానం కాదు.. ఖజానాను నింపుకొనే దోపిడీ మాడల్.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్ల్లు దాటినా ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌పై ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. రాబోయే రోజుల్లో పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకునే చర్యలపై ఒక విజన్ లేదు.. పార్కింగ్ పాలసీ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం చేయడం లేదు. కానీ కెమెరాలు పెడుతాం, ఖాతాలు లింక్ చేస్తాం, డబ్బులు డెబిట్ చేస్తాం అంటున్నారు. పాలనలో వైఫల్యాన్ని ఒప్పుకునే ధైర్యం లేక, ఆ భారాన్ని ప్రజల మీదకు నెట్టే రాజకీయ బలహీనత్వమే ఇది. ప్రజలు చట్టానికి లోబడాల్సిందే. కానీ చట్టం కూడా ప్రజల నమ్మకానికి లోబడాలి. విశ్వాసం లేని చోట భయం నాటడం పాలన కాదు. అది అధికార మత్తు. ఈ విధానం అమలైతే, రేపు ట్రాఫిక్ చలాన్ పేరుతో మొదలైన డైరెక్ట్ డెబిట్, ఇతర నేరాల పేరుతో మరింత విస్తరించదన్న గ్యారెంటీ ఏంటి? లేదా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ? ఇదేనా కాంగ్రెస్ చెప్పే ప్రజాపాలన? ఇదేనా ప్రజాస్వామ్య తెలంగాణ?
ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఖాతాలు లింక్ చేయడంలో కాదు, పాలనలో విజన్ ఉండడంలో ఉన్నది. SDRP Strategic Roadvelopment Programme హైదరాబాద్ నగర రవాణా చరిత్రలో కీలక మైలురాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ ప్రోగ్రామ్ ట్రాఫిక్ సమస్యలను శిక్షలతో కాదు, స్ట్రాటజీతో పరిష్కరించాలన్న దూరదృష్టికి నిదర్శనం. ఓల్డ్ సిటీ మొదలుకొని న్యూ సిటీ వరకు అనేక ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, గ్రేడ్ సెపరేటర్లు, లింక్ రోడ్లు , కారిడార్ అభివృద్ధి ఇవన్నీ యాదృచ్ఛికంగా కాదు, నగర భవిష్యత్ అవసరాలను అంచనా వేసి రూపొందించిన ప్రణాళికలు.
SDRP ద్వారా జంక్షన్లు క్లియర్ అయ్యాయి, ట్రావెల్ టైమ్ తగ్గింది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కెమెరాల్లో కాదు, కారిడార్లలో ఉన్నది. అయితే నేడు ఆ విజన్ కొనసాగాల్సిన చోట, పాలన దిశ మారింది. రోడ్లు విస్తరించాలన్న ఆలోచన లేదు, కొత్త లింక్ రోడ్లపై స్పష్టత లేదు, గ్రేడ్ సెపరేషన్ ప్రాజెక్టులపై నిశ్శబ్దం. దానికి బదులుగా చలాన్లు, ఆటో డెబిట్లు, ఖాతాల లింకింగ్. నగరాన్ని కదిలించిన పాలన నుంచి, ప్రజల ఖాతాలను మాత్రమే కదిలించే పాలనకు ఇది స్పష్టమైన పతనం.
డ్రంక్ అండ్ డ్రైవ్, అండర్ ఏజ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, హైస్పీడ్ డ్రైవింగ్ ఇలాంటి నేరాలకు చలాన్లు వేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. రోడ్డు భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకునే కఠిన చర్యలకు ప్రజలు ఇప్పటివరకూ సహకరిస్తూనే ఉన్నారు. కానీ అసలు సమస్య అక్కడ మొదలవడం లేదు. పోలీస్ స్టేషన్లకు నెలవారీ చలాన్ టార్గెట్లు విధించడం వల్లే గందరగోళం మొదలవుతున్నది. ఆ టార్గెట్లను చేరుకోవాలన్న ఒత్తిడిలో అనవసరమైన, అర్థరహితమైన చలాన్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. గల్లీల్లో, ఇంటి ముందే పార్క్ చేసిన బైక్ లేదా కారుపై కప్పి ఉంచిన కవర్లు తొలగించి మరీ ఫొటోలు తీసి చలాన్ వేయడం. ఇది ట్రాఫిక్ నియంత్రణ కాదు. ఇది ప్రజలను వేధించే వ్యవస్థగా మారింది.
పార్కింగ్ సమస్య ప్రజల తప్పు కాదు. పరిష్కారం లేకుండా శిక్ష వేయడం పాలన కాదు. ఇప్పుడు హైదరాబాద్‌కు కావలసింది చలాన్లు కాదు, వివేకం, విజన్, సిటిజన్ ఫ్రెండ్లీ పార్కింగ్ పాలసీ. వాటితో పాటు చలాన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ సెల్స్ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే చలాన్లపై ఒక శాస్త్రీయత ఉంటుంది. హైదరాబాద్ మహానగరం శాశ్వతం. అందుకే నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఖాతాలు లింక్ చేయడంలో కాదు. మీ నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పే నఫ్రత్ కి బజార్మే-మొహబ్బత్ కి దుకాణ్ అనే నినాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల గుండెల్లో మీ పైన శాశ్వతంగా నఫ్రత్ కి దుకాణ్ ఏర్పడుతుంది.
-షేక్ ఫారెజ్ మొహియుద్దీన్, 9666174738,
బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి