‘పామాయిల్’ మాట వినిపించగానే చాలామంది విష తుల్యంగా భావించి దాంతో చేసిన ఆహారాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అంతలా ప్రభావితం చేశారు మరి నేటి సోషల్‌మీడియా సైంటిస్టులు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక నూనె ఆరోగ్యకరమా కాదా అనేది నూనె పేరును చూసి కాకుండా.. దాన్ని ఎలా వాడుతున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం.. ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.
పామాయిల్ విటమిన్-ఇ తోపాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. అలా అని పరిమితికి మించి తీసుకోమని కాదు. అన్ని రకాల నూనెలను మారుస్తూ, పరిమిత మోతాదులో వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక రకమైన నూనెను మంచిదని, మరోదాన్ని చెడ్డదని ముద్ర వేయడం శాస్త్రీయంగా సరైన విధానం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన సమతుల ఆహారం, తక్కువగా వేయించిన పదార్థాలు, నూనెను నియంత్రించి వాడటమే ఆరోగ్యానికి అసలు మంత్రం అని గుర్తుచేస్తున్నారు.
ఆహారంపై నిర్ణయాలు తీసుకునే ముందు సోషల్ మీడియా ట్రెండ్స్‌ను కాకుండా సైంటిఫిక్ ఆధారాలను నమ్మాలని వైద్యులు సూచిస్తున్నారు. వస్తున్న ప్రతి కంటెంట్‌ను నమ్మి, యదార్థాలను సరిచూసుకోకుండా, వారి విద్యార్హతతో సంబంధంలేని అంశాలను భయంతో ఫాలో అవ్వడం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఒక్క పదార్థాన్ని చూసి తీర్పు చెప్పడం కాదు… మొత్తం ఆహారపు జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అని గ్రహించాలి.