రవీంద్రభారతి, నవంబర్ 14: బాలల హక్కుల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అనాథ పిల్లల సంరక్షణ, భద్రత, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి సుమారు 16 వేల మంది పిల్లలు అనాథలుగా మారారని తెలిపారు. వారికి తల్లిదండ్రులు లేని లోటు రానివ్వకుండా తమ శాఖ చూసుకుంటున్నదని చెప్పారు. ఆదివారం రవీంద్రభారతిలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ, అనాథ పిల్లలకు 18 ఏండ్లు వచ్చే వరకు విద్యతో పాటు అన్ని రంగాల్లో ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనాథల సంక్షేమం, వారి ఉన్నతి కోసం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలని ఆమె కోరారు. బాలలపై హేయమైన ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అనంతరం, మంత్రి తలసాని మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కళల్లో రాణిస్తున్న అనాథలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య, అధికారులు శ్రీనివాస్ రావు, అపర్ణ, నాగజ్యోతి, మూర్తి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.