కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ చర్య దేశ ఆర్థిక ప్రగతికి అవరోధాలను సృష్టిస్తుంది. ఇప్పటికే దేశం అసమానతలతో అతలాకుతలమవుతున్నది. ఈ బిల్లు వల్ల ఆర్థిక అసమానతలు మరింత తీవ్రస్థాయికి చేరుతాయి.
2008లో బ్యాంకింగ్‌రంగంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం నిలదొక్కుకొని గట్టెక్కడానికి ప్రభుత్వరంగ బ్యాంకులే ముఖ్య కారణమని ప్రపంచ దేశాలు కొనియాడాయి. 1969 నుంచి 52 ఏండ్లుగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కార్పొరేట్ మొండి బకాయిలు. ఈ కార్పొరేట్ రంగం తమ పలుకుబడిని ఉపయోగించి రుణమాఫీల ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకులు సాధించిన ప్రగతిని, లాభాలను కొల్లగొడుతున్నాయి. ఈ విధంగా ప్రైవేట్ కార్పొరేట్లకు చెందిన రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీలు దాదాపు రూ.10 లక్షల కోట్లు అయితే మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసింది.
ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ లాభాలు, పనితీరు పకడ్బందీగా ఉన్నది. కానీ ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి చెందిన బడా పారిశ్రామికవేత్తల మోసాల ఫలితంగా బ్యాంకింగ్ రంగం కుదేలైంది. వీటికి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలు మొత్తం రూ.15 లక్షల కోట్లకుపైనే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలను ప్రైవేట్ కార్పొరేట్లకు దోచిపెట్టడం సాగుతున్నది. ప్రభుత్వం రుణాలు ఎగవేసిన వారిమీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. వారి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి, అమ్మి మొండి బాకీలను వసూలు చేయాలి. కానీ ఆ పని చేయకుండా రుణాలను మాఫీచేసి వాటికే లాభం చేస్తున్నది. సామాన్యులు అప్పులు కట్టకపోతే వెంటాడి వసూలు చేస్తారు. మరి కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలను ఎందుకు వసూలుచేయరు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం దేశంలో ఏ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకైనా 15 శాతానికి పైబడి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటా ఉండకూడదు. కానీ కేంద్రం ఈ నిబంధనను సడలించి ఆ మొత్తాన్ని 26 శాతానికి పెంచింది. ఈ విధంగా దొడ్డిదారిన బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన ప్రైవేట్ బడా కార్పొరేట్ బాబులకే ఆ బ్యాంకులను కట్టబెట్టే ప్రయత్నం సాగుతున్నది.
2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ వందల సంఖ్యలో ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీసాయి. 180 ఏండ్ల చరిత్ర కలిగిన లెహమాన్ బ్రదర్స్, జేపీ మోర్గాన్ ఛేజ్, గోల్డ్ మ్యాన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, మెరిన్ లించ్, లాయిడ్స్, బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం కేవలం మొండి బకాయిల కారణంగా కుప్పకూలాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆర్థిక సహాయం ద్వారా, ప్రజల సొమ్మును వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే నిలదొక్కుకున్నాయి. మరి మన దేశంలో ప్రైవేటీకరణ తర్వాత మన బ్యాంకులు దివాలా తీస్తే వాటికి జవాబుదారు ఎవరు? ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారు?
ప్రభుత్వరంగ బ్యాంకులకు మొండిబకాయిలు, వాటి రద్దు అనే అంశాలు తలకు మించిన భారమైనప్పటికీ స్వశక్తితో, నిబద్ధతతో నిలదొక్కుకుని ముందుకుసాగుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకులను కాపాడాలంటే మొండి బకాయిదారులైన కార్పొరేట్ సంస్థలను శిక్షించాలి. కానీ ప్రభుత్వం ఆ మొండి బకాయిదార్లను నెత్తిన పెట్టుకొని, దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుకు కట్టబెట్టాలంటున్నది.
రైల్వేల తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించేది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం. దేశంలో అత్యధికులు జీవనోపాధి కోసం నమ్ముకున్న వ్యవసాయరంగానికి రుణాలిచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్నది ప్రభుత్వ బ్యాంకులే. చదువుకున్న, వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల వ్యక్తులకు రిజర్వేషన్ల ద్వారా ఉపాధి, ఆర్థికసాయం కల్పిస్తున్నది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగమే. ఆర్థిక స్వావలంబన సాధించే మహత్తర యజ్ఞంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి 50 కోట్లపై చిలుకు ‘జన్‌ధన్’ ఖాతాలను తెరిచింది ప్రభుత్వ బ్యాంకులే. అలాంటి ప్రభుత్వరంగ బ్యాంకులను పనిగట్టుకుని ప్రభుత్వమే ధ్వంసం చేయడానికి ప్రైవేటీకరిస్తున్నది. ఈ బ్యాంకులను దివాలా తీయించి, లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టబడటంతో పూర్తవుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడే ఈ సామాజిక రుణసహాయ సంస్థలైన ప్రభుత్వరంగ బ్యాంకులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉన్నది. కాబట్టి బ్యాంకింగ్‌రంగ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలుపాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: కన్వీనర్ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, తెలంగాణ)
బి.ఎస్.రాంబాబు
98666 33422