న్యూఢిల్లీ, మార్చి 2: బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం.. పసిడి ధరలను పరుగులు పెట్టిస్తున్నది. తమ పెట్టుబడుల రక్షణకు ప్రత్యామ్నాయంగా మదుపరులు ఎప్పట్లాగే పుత్తడిని భావించడంతో ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే తులం ధర రూ.52,000లను దాటేసింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.1,090 ఎగిసి రూ.52,040ని తాకింది. 22 క్యారెట్స్ గోల్డ్ రూ.1,000 ఎగబాకి రూ.47,700ని చేరింది. ఇక ఢిల్లీలో రూ.1,202 పెరిగి రూ.51,889గా ఉన్నట్టు బులియన్ వర్గాలు తెలిపాయి.
వెండి ధరలూ దూసుకుపోయాయి. కిలో వెండి ధర హైదరాబాద్లో ఈ ఒక్కరోజే రూ.2,100 ఎగిసి రూ.72,100ను తాకింది. ఢిల్లీలోనూ రూ.2,148 ఎగబాకి కిలో రూ.67,956 పలికింది.