అచ్చంపేట, నవంబర్ 11 : నల్లమలలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంతంలో వన్యప్రాణి అలుగుల వేట సంచలనంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి అలుగును పట్టుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్న ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకొని విచారిస్తున్నారు. నల్లమలలో కూడా అలుగులు ఉన్నట్లు ఈ సంఘటన ద్వారా బయటపడింది. ఈ ప్రాంతంలో మొదటిసారి ఇప్పుడే అలుగుల వేట బయటకు వచ్చింది. అలుగు ముఠా నల్లమలలో పాగా వేసినట్లు వెల్లడైంది. వీటిని వేటాడి విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో విక్రయించేందుకు తీసుకెళ్తున్న అలుగును వారి నుంచి అటవీశాఖ అధికారులు ప్రాణాలతో కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మం డలం పెట్రల్చేను, మద్దిమడుగు, పిల్లిగుండ్లుకు చెందిన చెంచు లు, ఉడిమిళ్లకు చెందిన యాదవ్, జడ్చర్లకు చెందిన ఒకరు, హైదరాబాద్‌కు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. స్థానికులు కలిసి హైదరాబాద్‌కు చెందిన వ్యా పారస్తుడితో నల్లమల నుంచి అలుగులు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు వరకు జడ్చర్ల వ్యక్తిద్వారా హైదరాబాద్‌కు విక్రయించేందుకు మాట్లాడినట్లు తెలిసింది. వీరి గుట్టు గురించి హైదరాబాద్‌లోని అటవీశాఖ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందగా.. వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీశైలం-హైదరాబాద్ రోడ్డు మార్గమధ్యం లో ఉన్న హాజీపూర్ చౌరస్తా వద్దకు పట్టుకున్న అలుగును తీసుకొని రాష్ట్ర రాజధానికి చెందిన వ్యక్తికి అప్పగించేందుకు ముఠా సభ్యులు వచ్చారు. అప్పటికే నిఘా ఉంచిన అధికారులు పట్టుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇ ద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. అలుగును ప్రాణాలతో కాపాడారు. పట్టుబడిన వారిని మన్ననూర్‌లో అటవీశాఖ కార్యాలయంలో విచారిస్తున్నారు. విచారణలో ముఠా సభ్యులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్ననట్లు సమాచారం. పాంగోలియన్ అని కూడా పిలిచే అలుగు ముంగీసను పోలి ఉంటుంది. వీటి పెంకులను చైనా, ఇతర దేశాల్లో మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారని తెలిసింది. పొలుసులను బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక మందుల తయారీలో ఉపయోగిస్తారట.