
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరంలేదని, ఎవరికివారు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో ఇప్పటివరకు నమోదుకాలేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా ఉన్నాయని వెల్లడించారు. కొవిడ్ తాజా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సన్నద్ధతపై చర్చించారు. అనంతరం శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త వేరియంట్ మనదేశంలోకి, రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయని చెప్పారు. శనివారం రాష్ట్రంలో 160 కొత్త కేసులునమోదు కాగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.88% గా ఉన్నదని వివరించారు.
ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా వైరస్ మనదేశంలోకి, రా్రష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని శ్రీనివాసరావు తెలిపారు. విమానాశ్రయాల్లో స్రీనింగ్ పెంచామని, కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి, శాంపిల్స్‌ను జీన్ సీక్వెన్స్ కోసం ల్యాబ్‌లకు పంపుతున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నామని వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రక్రియ పటిష్ఠంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వం సర్వసన్నద్ధం
ఒమిక్రాన్ ముప్పు వచ్చినా ఎదురొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉన్నదని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా మూడోవేవ్ ప్రణాళికను సిద్ధంచేశామని చెప్పారు. ప్రభుత్వ పరిధిలో 27,966 దవాఖాన పడకలు, చిన్నపిల్లల కోసం 10 వేల పడకలు ఏర్పాటుచేశామని వివరించారు. రూ.133.9 కోట్లతో పీడియాట్రిక్ బడ్జెట్ పెట్టి అవసరమైన వైద్య పరికరాలు, మందులు సేకరించామని వెల్లడించారు. గత పదిరోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేశామని చెప్పారు. ప్రజలంతా నిర్లక్ష్యం చేయకుండా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యవధి పూర్తయినా ఇంకా 25 లక్షల మంది రెండో డోసు వేసుకోలేదని చెప్పారు. ప్రతిఒక్కరూ మాసు ధరించటం, భౌతిక దూరం పాటించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం క్రమంతప్పక చేయాలని కోరారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీ ఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి పుట్టరాజు పాల్గొన్నారు.