మానకొండూర్ : బాలల హక్కులకు ( Children Rights) భంగం కలిగిస్తే చట్టం ( Law ) తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు ( Legal Cell lawyers) స్పష్టం చేశారు. బుధవారం మానకొండూరులోని పీయంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడారు.
బాల్య వివాహాలనే మహమ్మారి ఆడపిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తోందని పేర్కొన్నారు. కేవలం వివాహాలే కాకుండా సమాజంలో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టే ‘పోక్సో’చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనతో పాటు నేటి తరాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల ముప్పు నుంచి ఎలా బయటపడాలో సోదాహరణంగా వివరించారు.
ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్లు యస్.వి.ఆర్. కృష్ణ, బలుసుల శాంతి కుమార్, తిరుమణి అశ్విని, జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది కొత్తకొండ శంకర్, న్యాయవాది దుంపేటి శ్రీనివాస్ మాట్లాడారు.